రాణా ‘కృష్ణం వందే..’ తమిళ టైటిల్ ఖరారు
దగ్గుబాటి యువ హీరో రాణా కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. రాణా ప్రస్తుతం నటిస్తున్న కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రం తమిళంలో 'ఓంగారం' పేరిట రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ ఇప్పటికే తమిళ ప్రేక్షకులకు సుపరిచితం. క్రిష్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం 'వేదం' అప్పట్లో తమిళంలో 'వానం' పేరుతో విడుదలైంది.
వాస్తవానికి రాణా గతంలోనే 'వెట్టయ్ మన్నన్'అనే చిత్రం ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న రాణా, ఇప్పుడు తన తెలుగు సినిమాను అక్కడ అనువదించడం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
రాణా ఇందులో బీటెక్ బాబుపాత్ర చేస్తుండగా... రాణా సరసన నయనతార దేవిక పాత్ర పోషిస్తోంది. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయి.
రాణా ఇప్పటి వరకు బాలీవుడ్, టాలీవుడ్లలో కలిసి దాదాపు అర డజను చిత్రాలు చేశాడు. ఎక్కడా కూడా రాణాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. అయినా సరే తన మార్కెట్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న రాణాకు తమిళ ఎంట్రీ అయినా కలిసొస్తుందో లేదో...


Click it and Unblock the Notifications











