నా అందం చూసి అలా చేస్తున్నారు.. చరణ్ తప్ప నాకేమీ కనిపించట్లేదు: మనసులో మాట బయటపెట్టిన కృతి శెట్టి
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదైనా బడా ఫ్యామిలీకి చెందిన హీరో లాంఛింగ్ అంటే ఎంత గొప్పగా ఉంటుందో ఎన్నో సందర్భాల్లో చూశాం. అయితే, మొదటి సినిమాతోనే చాలా మంది హీరోలు హిట్టు కొట్టలేదు. కానీ, తాజాగా టాలీవుడ్‌కు పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ మాత్రం ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్‌తో కెరీర్‌ను ఆరంభించాడు. అతడు నటించిన 'ఉప్పెన' కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఆ మూవీ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్‌పై హీరోయిన్ కృతి శెట్టి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!
Recommended Video

కొత్త వాళ్లే కానీ... కత్తిలాగా తీశారు
రిలీజ్‌కు ముందే బజ్ పెంచుకున్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రం ద్వారా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అవగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఇక, విజయ్ సేతుపతి తెలుగులో తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వీళ్లంతా మంచి ఔట్‌పుట్ ఇచ్చారు.

టాక్ ఒకలా.. మూవీ రిజల్ట్ మరోలా
ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'ఉప్పెన'. మొదటి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుందీ సినిమా. దీంతో ఈ మూవీ భవితవ్యంపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిందీ సినిమా. తద్వారా కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

మూడు రోజుల్లోనే ఫినీష్ చేసిందిగా
'నీ కన్ను నీలి సముద్రం' అనే పాటతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లు అనుకున్నారు. ఇక, దీన్ని కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసిందీ మెగా హీరో మూవీ. అంతేకాదు, లాభాలను కూడా అందుకుంది.

విజయోత్సవ సభ.. చరణ్ చీఫ్ గెస్ట్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఉప్పెన' సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఆ సినిమా విజయోత్సవ సభ రాజమహేంద్రవరంలోని వీఎల్‌పురం మార్గాణి ఎస్టేట్స్ మైదానంలో జరిగిన దీనికి చిత్ర యూనిట్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సక్సెస్ చేశారు.

నా అందం చూపి ఫోన్ చేస్తున్నారు
ఈ వేడుకలో హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. 'సినిమా చూసి చాలా మంది ఫోన్ చేసి ఈ స్టోరీ ఎప్పుడూ మా గుండెల్లో ఉండిపోతుందని చెపుతున్నారు. చాలా గర్వంగా ఫీలవుతున్నాను. అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బుచ్చిగారు. సినిమాటోగ్రాఫర్ శామ్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. ఈ సినిమాకు సుకుమార్ గారు ఒక లైట్ హౌస్‌లా ఉన్నారు' అని చెప్పుకొచ్చింది.

చరణ్‌పై కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వేడుకలో హీరోయిన్ కృతి శెట్టి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. 'కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే, చరణ్ సార్ ఇక్కడ ఉన్నారు. నిజానికి నాకు రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరూ కనిపించట్లేదు. 'రంగస్థలం'లో ఏం చేశారు సార్. ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్ సార్. ఆయనకు నేను చాలా పెద్ద అభిమానిని' అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.


Click it and Unblock the Notifications











