అవతార్ రికార్డు బద్దలు కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. అసహ్యమే అలా అనిపించిందన్న విజయేంద్ర ప్రసాద్!
దర్శకుడు రాంగోపాల్ వర్మ లడికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో పూజా భలేకర్ హీరోయిన్ గా నటించింది. మొట్టమొదటి ఇండో చైనీస్ మూవీగా రూపొందిన ఈ సినిమా జూలై 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న రచయిత విజయేంద్ర ప్రసాద్ రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే గాక లడకీ సినిమా అవతార్ రికార్డు కూడా బద్దలు కొట్టింది అనే విషయాన్ని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆసక్తికర వ్యాఖ్యలు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లడికి అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గాక చైనీస్ భాషలో కూడా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.. చైనాలో ఏకంగా 40 వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ గా మారింది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్ని కలగలిపి
సుమారుగా 10 నెలల క్రితం కనబడుట లేదు అనే సినిమా ఫంక్షన్ కి తనను పిలిచారని అదే ఫంక్షన్ కి రాంగోపాల్ వర్మ కూడా వచ్చారని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆ సినిమా ఫంక్షన్ సమయంలో తనకు 10 నుంచి 15 సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ మీద తనలో గూడు కట్టుకున్న కోపం, చిరాకు, అసహ్యం, బాధ అన్ని కలగలిపి అనుకోకుండా తన నోటి వెంట కొన్ని మాటలు వచ్చాయని అన్నారు.

కనిపించడం మానేశారు
అవేమిటంటే శివ సినిమా చూశాను ఆ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయావు నేనే కాదు నాలాంటి కొంతమంది రచయితలు, టెక్నీషియన్స్, డైరెక్టర్లు ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా ఫీల్డ్ లో నిలబడ్డారు. కానీ ఆ రామ్ గోపాల్ వర్మ గారు కనిపించడం లేదు ఆయన కనిపించడం మానేశారు. రాంగోపాల్ వర్మ గారు కనిపించడం మానేశారు మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి మళ్లీ అలాంటి సినిమా తీయమని చెప్పండి అని ఆ స్టేజ్ మీద చెప్పాను.

100 రెట్లు ఎక్కువగా
అలా అనవచ్చో, అనకూడదో తెలియదు కానీ నాలో ఉన్న ఆవేశం అలా అనిపించేసింది. కానీ ఇప్పుడు గర్వంగా చెబుతున్నాను రాము గారు మీరు కనిపించారండి అంటూ వర్మను హత్తుకున్నారు. ఎలా కనిపించారంటే అప్పటి శివ కంటే 100 రెట్లు ఎక్కువగా కనిపించారు అని చెప్పుకొచ్చారు.

అవతార్ రికార్డు బద్దలు
మీ సినిమా 40,000 ధియేటర్లలో విడుదలవుతుందంటే అది ఒక అద్భుతమైన విషయం అని చెబుతూనే ఇప్పటివరకు అవతార్ లాంటి సినిమా కూడా దాదాపు 20 వేల థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు అనే విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. ఆ విధంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ లడకీ సినిమాతో అవతార్ రికార్డు బద్దలు కొట్టారని చెప్పుకొచ్చారు ఆయన. అది మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అని విజయేంద్రప్రసాద్ అన్నారు.


Click it and Unblock the Notifications











