బయోపిక్ అంటే అవి కూడా చూపాలి, ఆ పాట బాధించింది: లక్ష్మి పార్వతి
Recommended Video

ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' సినిమా విడుదలైన నేపథ్యంలో ఆయన సతీమణి లక్ష్మి పార్వతి రియాక్ట్ అయ్యారు. బయోపిక్ అంటే సుఖంగా ఉండే పోర్షన్ మాత్రమే చూపించడం కాదని, కష్టాలను కూడా చూపించాలని, అప్పుడే అది బయోపిక్ అవుతుందని తెలిపారు.
మహానుభావుడు ఎన్టీ రామారావుగారు సినిమాల్లోకి రాక ముందు కూడా చాలా కష్టాలు పడ్డారని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చారు. ఆయన్ను వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేశారని, బయోపిక్ అన్నపుడు ఇవన్నీ చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

నాపై ముందు నుంచీ దుష్ప్రచారమే..
తనపై ముందు నుంచీ దుష్ప్రచారం చేశారని, రామారావుతో తనకు పెళ్లి కాలేదని తప్పుడు వార్తలు సృష్టించారని ఈ సందర్భంగా లక్ష్మి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో తనను టార్గెట్ చేస్తూ, ప్రజల్లో తననొక బూచిగా చూపించారని తెలిపారు.

ఆ పాట బాధించింది...
కాగా.. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలోని ‘ఎందుకు?' సాంగ్ తనను బాధించిందని లక్ష్మీ పార్వతి తెలిపారు. అది తనను విమర్శించినట్లు ఉందని, అయితే చివర్లో వాటిని కేవలం ప్రశ్నలుగా చూపించారని... వ్యాఖ్యానించారు.

మా సినిమా వస్తేనే బయోపిక్ సంపూర్ణం
బాలకృష్ణ, క్రిష్ తీసింది పూర్తి బయోపిక్ కాదని, అందులో ఎన్టీఆర్ సగం జీవితమే ఉందని.... మా సినిమా(లక్ష్మీస్ ఎన్టీఆర్) వచ్చిన తర్వాతే బయోపిక్ సంపూర్ణం అవుతుందని లక్ష్మి పార్వతి అన్నారు. బాలయ్య తను తీసిన సినిమా చూడటానికి ఆహ్వానించలేదని ఆమె తెలిపారు. బాలకృష్ణ మంచి వాడే కానీ ఇంకా అతడి బావ చంద్రబాబు పరిధిలోనే ఉన్నాడని తెలిపారు.

వర్మ ఏమంటున్నారంటే?
‘ఎందుకు?' అనే పాటను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ..ఈ పాటలోని ప్రశ్నల వెనక అబద్దాలుగా చలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ధ్యేయమని వర్మ తెలిపారు. 20 సంవత్సరాలకుపైగా నిజానికి అబద్దం అనే బట్టలు తొడిగి వీధులెంట తిప్పుతున్న వెన్నుపోటుదారులందరి బటల్ని చింపి అవతల పారేసి నిజం బట్టల్ని ఒక్కొట్టిగా మెల్లగా విప్పి దాన్ని మళ్లీ పూర్తి నగ్నంగా చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశ్యమని వర్మ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











