లక్ష్మీస్ ఎన్టీఆర్: ఓవర్సీస్ మార్కెట్లో పరిస్థితి ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు!
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఇండియా కంటే ముందే యూఎస్ఏ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఒకరోజు ముందుగానే మార్చి 28న ప్రీమియర్ షోల ద్వారా విడుదల కాబోతోంది. ఓవర్సీస్ మార్కెట్లో భారీ ఓపెనింగ్స్ సాధించే దిశగా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేశారు.
రామ్ గోపాల్ వర్మ సినిమా కెరీర్ చూస్తే... వరుస ప్లాపుల్లో ఉన్నారు. యూఎస్ఏ, ఆస్ట్రేలియా లాంటి సెంటర్లలో ఆయన సినిమాకు అసలు ఆదరణే ఉండదు. అయినప్పటికీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ చిత్రంపై అక్కడి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు జీవితంలో కాంట్రవర్సల్ అంశాలు ఈ చిత్రంలో చూపించబోతుండటమే అందుకు కారణం.

125 లొకేషన్లలో ప్రీమియర్ షో
‘వీకెండ్ సినిమా' అనే సంస్థ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. యూఎస్ఏలో దాదాపు 125 లొకేషన్లలో ప్రీమియర్ షోలు వేసేందుకు సన్నాహాలు చేశారు. అన్ కట్, అన్ సెన్సార్డ్ వెర్షన్ ఈ ప్రీమియర్ షోలో ప్రదర్శించబోతున్నట్లు ఆల్రెడీ పబ్లిసిటీ ప్రారంభించారు. మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజమైన నిజం ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్లు
మార్చి 25న ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ యూఎస్ఏలో ప్రారంభం అయింది. సినిమా చుట్టూ భారీగా క్యూరియాసిటీ ఉండటంతో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. చాలా లొకేషన్లలో ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్ అయిపోయినట్లు తెలుస్తోంది.

భారీగా డిమాండ్
ఆస్ట్రేలియాలో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. మెల్‌బోర్న్‌తో పాటు పలు చోట్ల ప్రీమియర్ షో టిక్కెట్లన్నీ అయిపోయాయి. సినిమాకు ఎంత డిమాండ్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై క్రేజ్
తెలుగు రాష్ట్రాల్లో సైతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేం కానీ... ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ తీసిన అన్ని సినిమాలను మించిపోయేలా ఉండటం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

వెన్నుపోటు పర్వం ప్రధానంగా
ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చర్చిస్తూ... రామారావు కుటుంబంలో, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మారిన పరిణమాలు ఫోకస్ చేస్తూ, వెన్నుపోటు పర్వాన్ని హైలెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఉండబోతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.


Click it and Unblock the Notifications











