ఎన్టీఆర్ బయోపిక్ : ఎక్కువ ఊహించకండి కథ కొంతవరకే....
ఈ బయో పిక్ లో మొత్తం జీవితాన్ని చూపించరట., ఒక పల్లెటూరినుంచి మొదలయిన రైతు బిడ్డ ఒక రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయ్యేవరకూ ఒక విజయ గాథ గా మాత్రమే ఈ సినిమా ఉంటుందట
గతకొన్నాళ్ళుగా టాలీవుడ్ లో మరీ ఆసక్తిని కలిగించిన ప్రధాన విషయాల్లో ఎన్టీయార్ పై బయో పిక్ అనేది ఒకటి. ఇప్పుడు నందమూరి తారకరామారావు బయోపిక్ ని రూపొందించాలని బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో ఈ చిత్రంలో విలన్ అదే నెగిటివ్ పాత్ర ఏమిటనే చర్చ అంతటా మొదలైంది.
ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్స్ లో ఈ సినిమా గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎన్టీయార్ నిజ జీవిత కథలో తానే హీరోగా నటిస్తానని బాలయ్య ప్రకటించాడు. అయితే ఎన్టీయార్ బయోపిక్ గురించి బాలయ్యకు సలహా ఇచ్చింది పూరీ జగన్నాథ్ అని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. అందుకు సంబంధించి సింపుల్‌గా స్టోరీలైన్‌ను కూడా బాలయ్యకు వినిపించాడట. అది బాలయ్యకు నచ్చడంతో పూర్తి స్థాయి స్ర్కిప్టు మీద పనిచేస్తున్నాడట పూరీ.

ఆయనకు మరో ఇద్దరు రచయితలు సహకారమందిస్తున్నారట. వరుసగా పరాజయాలతో డీలా పడిన పూరీ.. ఎన్టీయార్ బయోపిక్‌తో సెన్సేషన్ సృష్టించాలనే కసితో ఉన్నాడట. ఈ సినిమా గురించిన పూర్తి విశేషాలను ఎన్టీయార్ జయంతి రోజైన మే 28న వెల్లడిస్తారట. మరి, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అప్పటివరకు ఆగాల్సిందే.
ఇక ఈ విషయమై టీడీపి ఎమ్మల్యే బొండా ఉమ మాట్లాడుతూ...ఎన్టీఆర్ బయోపిక్ లో లక్ష్మీ పార్వతి విలన్ అన్నారు. ఇప్పుడీ మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ విషయమై లక్ష్మీ పార్వతి కోర్టుకు వెళ్లే అవకాసం ఉందంటున్నారు. సినిమా ప్రారంభం కాకుండానే వివాదాలు చుట్టు ముడుతున్నాయన్నమాట.
అంతే కాదు ఎన్టీయార్ చివరి రోజుల్లో ఆయనకు జరిగిన అవమానాలూ, వెన్నుపోటు అంటూ ప్రజల్లో ఉన్న కథనాలను కూడా ఎలా తీస్తారు అన్న చర్చలూ వచ్చాయి. ఇదే విషయాన్ని హైలేఅట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టు లేవచ్చాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమాధానం ఈ అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పేలా ఉంది.

ఈ బయో పిక్ లో మొత్తం జీవితాన్ని చూపించరట., ఎన్టీయార్ నిమ్మకూరులో ఇంటింటికి తిరిగి పాలు అందించిన దగ్గర్నుంచి, చెన్నయ్ రావడం, టాప్‌స్టార్‌గా ఎదగడం, రాజకీయాల్లోకి రావడం, కేంద్రంలో కాంగ్రెస్‌ను ఎదురించి, రాష్ట్రంలో అధికారంలోకి రావడం వరకు మాత్రమే ఈ సినిమా ఉంటుందనే విషయం తెలుస్తోంది.
అంటే ఒక పల్లెటూరినుంచి మొదలయిన రైతు బిడ్డ ఒక రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయ్యేవరకూ ఒక విజయ గాథ గా మాత్రమే ఈ సినిమా ఉంటుందన్న మాట. ఈ సినిమాకు 'ప్రస్థానం' డైరెక్టర్ దేవ్‌కట్టా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయనే గాసిప్ వినబడుతోంది. అయితే మరికొంత మంది మాత్రం ఆ రోజు బాలకృష్ణ ఏదో యథాలాపంగా ఎన్టీయార్ బయోపిక్ గురించి మాట్లాడాడని, ఆ సినిమా చేసే ఉద్దేశం నిజంగా బాలయ్యకు లేదని అంటున్నారు. ఏది నిజమో ఏది రూమరో పక్కా గా తెలియాలీ అంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











