కోట్లు ఖర్చుతో సీన్లు: ప్రభాస్ లుక్ బయటకు రాకుండా కఠినమైన ఆంక్షలు!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో మూవీ షూటింగులో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించారు. సినిమా ఫోటోస్ లీక్ కాకుండా ఈ కఠినమైన ఆంక్షలు విధించారు దర్శకుడు సుజీత్.
స్మార్ట్ ఫోన్లు, కెమెరా ఫోన్లు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా వాళ్లకి చాలా ఇబ్బంది అవుతోంది. సినిమా షూటింగ్ జరుగుతుండగానే హీరోకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో లీక్ అవుతున్నాయి.
ఈ లీక్స్ వ్యవహారంతో ఇబ్బంది పడుతున్న దర్శకులు.... షూటింగ్ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, ఆంక్షలు విధించాల్సి వస్తోంది. ముఖ్యంగా షూటింగ్ ప్రదేశాల్లో సెల్ ఫోన్లు వాడటాన్ని నిషేధించడం లాంటివి చేస్తున్నారు.

సాహో స్టిల్స్ అందుకే బయటకు రాలేదు
లీక్ సమస్య ఎక్కువ కావడంతో 'సాహో' సినిమాకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలా తీసుకున్నారు కాబట్టే హైదరాబాద్ షెడ్యూల్ కి సంబంధించి ఒక్క స్టిల్ కూడా బయటకు రాలేదు.

నెక్ట్స్ షెడ్యూల్ అబుదాబీ
త్వరలో సాహో షూటింగ్ 'అబుదాబీ'లో మొదలు కానుంది. సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ ఇదే. దాదాపు 65 రోజుల పాటు ఇక్కడ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక్కడ కూడా లొకేషన్ కి ఎవరూ మొబైల్స్ తీసుకురావద్దని ముందుగానే కఠినమైన ఆంక్షలు పెట్టారట.

రూ.150 కోట్ల బడ్జెట్
సాహో చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూవి క్రియేషన్స్ వారే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఏ మాత్రం వెనకాడకుండా భారీగా ఖర్చు
దర్శకుడు సుజీత్‌కి పెద్ద సినిమా తీసిన అనుభవం లేకపోయినా అతనిపై నూట యాభై కోట్ల ప్రాజెక్ట్ బాధ్యత మోపారు. యాక్షన్ సీన్లు హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోకుండా తీయడానికి సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇరవై నిమిషాల పాటు సాగే ఒక ఛేజ్ సీక్వెన్స్‌ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌తో చేయిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్స్‌కి పని చేసిన నిపుణులు దీనికి వర్క్ చేస్తున్నారు. ఈ సీన్ కోసమే 25 కోట్లకి పైగా ఖర్చు పెడుతున్నారట. ఇంత ఖర్చు పెట్టి తీస్తున్న సీన్లు నేరుగా సినిమాలో చూస్తేనే ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. ముందే లీక్ అయితే ఆ థ్రిల్ పోతోంది.

తెలుగుతో పాటు హిందీలో కూడా
చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో చేస్తున్నారు. సాహో ఫస్ట్ లుక్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయి హీరో కావడంతో అతడి మార్కెట్ కూడా బాగా పెరిగింది. దానికి తగిన విధంగానే సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











