వినాయక చవితి స్పెషల్.. నందమూరి అభిమానులకు సర్‌ప్రైజ్
యంగ్ హీరోలతో పోటీ పడుతూ నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో సెంచరీ కొట్టేసిన ఈ వెటరన్ హీరో ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా తర్వాత ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో బాలయ్య బాబు క్రియాశీలంగా పాల్గొనడం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవలే కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వినాయక చవితిని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

థాయిలాండ్ షెడ్యూల్ ఫినిష్
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ కొత్త సినిమా ఇటీవలే థాయిలాండ్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది. 20 రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు. చిత్రంలోని 2 పాటలు, యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. ఈ షూటింగ్ లో హీరో బాలకృష్ణ,
ఇద్దరు హీరోయిన్స్ పాల్గొన్నారు.

బాలయ్య బాబు లుక్స్
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన ఓ లుక్‌కి విశేష స్పందన లభించింది. ఇందులో యంగ్ లుక్ లో కనిపించి షాకిచ్చారు బాలకృష్ణ. ఇదిలా ఉంటే తాజాగా వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ రెండు పోస్టర్స్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

హెలీకాప్టర్ దిగుతూ, హీరోయిన్‌తో కలిసి
యంగ్ లుక్‌లో బాలయ్య హెలీకాప్టర్ దిగుతున్నట్లుగా ఓ పోస్టర్, హీరోయిన్ సోనాల్ చౌహాన్‌తో బాలయ్య స్టెప్పులేస్తున్నట్లుగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రెండు పోస్టర్స్ విడుదలైన కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పోస్టర్స్‌లో బాలయ్య బాబు లుక్ చూసి తెగ మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ నటించడం ఇది మూడోసారి. గతంలో ‘లెజెండ్', ‘డిక్టేటర్' సినిమాల్లో బాలయ్యతో జోడీ కట్టింది సోనాల్.

రెండో షెడ్యూల్ ఎప్పుడంటే..
ఇటీవలే థాయిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 5 నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. చిత్రంలో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లు వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











