రాజ్ తరుణ్ కేసు : తెరపైకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ పేరు.. వదలిపెట్టను, గెలిచేది ధర్మమేనన్న లావణ్య
హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతూ టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. నెలలు గడుస్తున్నా ఈ కేసు ఓ కొలిక్కి రాకపోవడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తనను మోసం చేసి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య రెండు నెలల క్రితం హైదరాబాద్ నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే దగ్గరుండి అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది.
రాజ్‌ను వదిలేయాలని, లేనిపక్షంలో అంతు చూస్తామని మాల్వీ , ఆమె సోదరుడు తనకు వార్నింగ్ ఇచ్చారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. మెడికల్ రిపోర్ట్స్, దాదాపు 170కి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై పోలీసుల విచారణ జరుగుతున్న దశలోనే రాజ్ లేకుండా తాను బతకలేనని, అన్నింటికీ మాల్వీయే కారణమంటూ అర్ధరాత్రి పూట తన లాయర్‌కు సూసైడ్ మెసేజ్ పెట్టి కలకలం సృష్టించింది లావణ్య.

నేరం రుజువైన పక్షంలో ఆయనకు కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. తర్వాత రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం మధ్యలోకి రకరకాల వ్యక్తులు ప్రవేశించారు. ఆర్జే శేఖర్ భాషా, ప్రీతి, మస్తాన్ సాయి వంటి వారు రకరకాల ఆరోపణలు చేశారు. శేఖర్ భాషా ఓ అడుగు ముందుకేసి లైవ్ డిబేట్‌లలోనూ పాల్గొన్నాడు, ఓ చర్చా కార్యక్రమంలో అతనిపై లావణ్య చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది.
ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌లపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే . రాజ్‌తరుణ్‌కు నోటీసులు జారీ చేయగా, ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజ్ సినిమాలు చేసుకుంటుండగా, శేఖర్ భాషా బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు, లావణ్య అయితే అసలు అడ్రస్ లేదు. దీంతో ఈ కథకి ఎండ్ కార్డ్ పడినట్లేనని అంతా అనుకున్నారు.
ఇలాంటి దశలో పోలీసులు శుక్రవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో రాజ్‌తరుణ్‌ని నిందితుడిగా చేర్చారు. లావణ్య చెబుతున్న దానిలో వాస్తవాలు ఉన్నాయని, ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించినట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై లావణ్య స్పందించారు. చివరికి న్యాయమే గెలుస్తుందని తాను భావిస్తున్నానని, రాజ్ తరుణ్‌కి వ్యతిరేకంగా వెళ్లాలన్నది తన ఉద్దేశం కాదని, నాకు ఆయన కావాలని ఆమె తేల్చిచెప్పారు.
తనను నానా మాటలు అన్నారని.. రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాక మెంటల్‌గా ఎంతో బాధపడ్డానని లావణ్య చెప్పింది. శేఖర్ భాష అనే వ్యక్తిని తనపై ఉసిగొలిపి నిందలు వేశారని.. కేసును తప్పుదోవ పట్టించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని లావణ్య ఆరోపించింది. రాజ్ శిక్ష అనుభవించాలని తాను కోరుకోవడం లేదని.. కానీ తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మాల్వీ - రాజ్ తరుణ్ ఎఫైర్ నిజమని .. ఆమె వల్లే తనను ఆయన వదిలించుకోవాలని చూశాడని లావణ్య ఆరోపించింది.


Click it and Unblock the Notifications











