'హలో' చిచ్చు, నాగార్జునపై కోర్టుకెక్కిన జార్ఖండ్ వ్యక్తి: నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని!
Recommended Video

అసలే సినిమా ఫ్లాప్.. పైగా కాస్ట్ పెయిల్యూర్.. ఇలాంటి తరుణంలో నాగార్జునకు ఇదో పెద్ద తలనొప్పే. ఇంతకీ ఏంటా తలనొప్పి.. 'హలో' సినిమాలో ఉపయోగించిన ఓ ఫోన్ నెంబర్ ఇప్పుడు నాగార్జునను వెంటాడుతోంది. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా సినిమాలో ఓ ఫోన్ నంబర్ ను ఉపయోగించడంతో.. ఆ నంబర్ కలిగి ఉన్న వ్యక్తి తీవ్ర ఇబ్బందుల పాలయ్యాడట. ఫోన్ నిరంతరం మోగుతూనే ఉండటంతో వ్యాపారంపై కూడా ఫోకస్ చేయలేకపోయాడట..

నాగార్జునపై కేసు:
'హలో' సినిమా వల్ల తనకు కలిగిన అసౌకర్యానికి, ఇబ్బందికి నిర్మాత నాగార్జున బాధ్యత వహించాల్సిందేనని ఇప్పుడా వ్యక్తి న్యాయ వ్యవస్థను ఆశ్రయించడం గమనార్హం. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వికాస్ ప్రజాపతి.

మోత మోగిన ఫోన్:
సినిమాలో ఆ ఫోన్ నంబర్ ను హీరోయిన్ కల్యాణిదిగా చూపించారు. దీంతో ఆ ఫోన్ నంబర్ నిజంగా ఆమెదే అనుకుని చాలామంది ఫోన్స్ చేయడం మొదలుపెట్టారు. కల్యాణి ఫ్యాన్స్ నుంచి నిరంతరం ఫోన్ కాల్స్ రావడంతో వికాస్ కు చిర్రెత్తుకొచ్చింది. అసలిదంతా ఏంటని ఆరా తీస్తే అప్పుడు 'హలో' సినిమా గురించి తెలిసిందట.

నష్ట పరిహారం చెల్లించాలని:
తన వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపారాన్ని డిస్టర్బ్ చేసినందుకు గాను రూ.50లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించాలని వికాస్ ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశాడు. అసలే హలో, రంగుల రాట్నం సినిమాలు మిగిల్చిన నష్టాల్లో ఉన్న నాగార్జునకు ఇదో పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

అన్నపూర్ణ స్టూడియోస్ వాదన:
మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ల వాదన మరోలా ఉంది. తాము టెలికాం ఆపరేటర్ అనుమతి తీసుకునే ఆ నంబర్ వాడుకున్నామని, ఇలా అవుతుందనుకోలేదని అంటున్నారు. ఒకవిధంగా దీనికి మాకు ఏ సంబంధం లేదనే అంటున్నారు.

ఎందుకిలా చేశారు:
తమకు సంబంధం లేదని చేతులు దులుపేసుకున్నంత మాత్రాన ఈ ఇష్యూ సద్దుమణగడం కష్టమే. విషయం కోర్టు దాకా వెళ్లింది కాబట్టి.. నాగార్జున దాన్ని ఎదుర్కోవాల్సిందే. అయినా మార్కెట్లో ఐదు రూపాయలకే కొత్త సిమ్ కార్డులు దొరుకుతుంటే.. ఇలా ఎవరి నంబరో వాళ్ల అనుమతి లేకుండా ఎందుకు వాడుకున్నారు?..


Click it and Unblock the Notifications











