‘జంజీర్’ నిర్మాతలకు లీగల్ నోటీసులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'జంజీర్' చిత్రంపై గత కొంత కాలంగా వివాదం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. జంజీర్ ఒరిజినల్ వెర్షన్ రచయితలు అయిన సలీమ్, జావేద్ అక్తర్‌లు తమ కథను మళ్లీ రీమేక్ చేయడానికి తమ అనుమతి తీసుకోలేదని, తమ స్టోరీని వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో వారు తాజాగా లీగల్ నోటీసులు పంపారు. దీంతో రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా 'జంజీర్' వివాదం కోర్టుకెక్కక తప్పేట్లు లేదు.
కాపీరైట్ అమెండ్ మెంట్ బిల్ 2011ను సమీక్షించిన కమిటీలో సభ్యుడైన జావెద్ అఖ్తర్ ఆ హక్కు ప్రకారం తనకు రావాల్సిన రాయల్టీ కోసం పోరాడుతున్న తొలి వ్యక్తిగా నిలిచారు. కాపీరైట్ బిల్లు ప్రకారం సినిమాలకు సంబంధించి రచయితకు కూడా రాయల్టీ హక్కు ఉంటుంది.
ఈ మేరకు జావెద్ అఖ్తర్ ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ లీగల్ కంపెనీ లూథ్రా అండ్ లూథ్రాను సంప్రదించారు. ఆయన తరపున ఆ కంపెనీ అమిత్ కు లీగల్ నోటీస్ జారీ చేసింది. "చర్చించుకోవడానికి రమ్మని అమిత్ కు చెప్పాం. మమ్మల్ని మూడుసార్లు కలిసిన అమిత్ ఒక్కసారి కూడా రాయల్టీ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కొద్ది రోజుల్లో ఈ విషయం గురించి మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని వివరాలూ చెబుతాం" అని జావేద్ తెలిపారు.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్.


Click it and Unblock the Notifications











