ఫ్యామిలీ ఆడియన్స్‌కి షాక్: ‘లెజెండ్’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'లెజెండ్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే ఈచిత్రం సెన్సార్ రిపోర్ట్ చూసిన ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం కాస్త షాకవుతున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు 'A' సర్టిఫికెట్ జారీ చేయడమే. 'A' సర్టిఫికెట్ కారణంగా పిల్లలతో కలిసి వెళ్లలేని పరిస్థితి ఉందని కొందరు నిరాశకు గురవుతున్నారు.
అయితే కథా పరంగా ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం. అందు వల్ల కొన్ని సీన్ల విషయంలో రాజీపడలేని పరిస్థితి. ఈ చిత్రానికి 'A' సర్టిఫికెట్ వస్తుందని తాము ముందే ఊహించామని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. బాలకృష్ణ అభిమానులు, ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఎన్నికల వేళ.....సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగులు ఉండటం వల్ల సర్టిఫికెట్ పొందే విషక్ష్ంలో నిర్మాతల కాస్త ఇబ్బంది పడ్డారు. సెన్సార్ బోర్డుతో పాటు ఎన్నికల కమీషన్ పర్మీషన్ కూడా పొందాల్సి వచ్చింది. మొత్తానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.
'లెజెండ్' చిత్రం ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంస్థ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందే భారీగా ప్రీమియర్ షోలు కూడా నిర్వహిస్తున్నారు.
గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'సింహా' లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన నేపథ్యంలో 'లెజెండ్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. రాధిక ఆప్టేతో పాటు, సోనాల్ చౌహాన్ ఇందులో బాలయ్యకు జోడీగా నటించారు. ఈ చిత్రం ద్వారా జగపతి బాబు విలన్ అవతారం ఎత్తారు. ఇప్పటి వరకు వెండి తెరపై హీరోగా రాణించిన జగపతి....ఈ చిత్రంలో భయంకరమైన విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.


Click it and Unblock the Notifications











