నైజాంలో ఆల్ టైం రికార్డు దిశగా సాగుతున్న ‘లెజెండ్’!
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. సినిమా హిట్ టాక్ రావడానికి తోడు...బాలయ్యతో పాటు దర్శక నిర్మాతలు 'లెజెండ్ సింహ యాత్ర' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుండటంతో సినిమాకు పబ్లిసిటీ బాగా పెరిగి పోయింది.
దీనికి తోడు....బాలయ్య 'లెజెండ్' సినిమాతో పోటీ పడే సినిమాలేవీ బరిలో లేక పోవడం ఈ చిత్రానికి కలిసొచ్చింది. మంచు ఫ్యామిలీ మూవీ 'రౌడీ' విడుదలైనప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద 'లెజెండ్' చిత్రంతో పోటీ పడలేక పోతోంది. ఇక ఇతర చిన్న సినిమాల పరిస్థితి ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు.

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఏ చిత్రానికి రానంతగా వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు నైజాంలో ఈ చిత్రం రూ. 8 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం రికార్డు బద్దలు కొట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
లెజెండ్ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తుంగా ఈచిత్రాన్ని నిర్మించాయి. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈచిత్రంలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











