జయచిత్రకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు
ప్రముఖ తెలుగు, తమిళ నటి జయచిత్రకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు లభించింది. ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ 58వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ భారత సినీ, టీవీ అవార్డులను ప్రదానం చేసింది. చెన్నై తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. 2008 సంవత్సరానికి అవార్డులను అందజేశారు. ఉత్తమ దర్శకుడిగా దశావతారం చిత్రానికి కెఎస్.రవికుమార్ ప్రముఖ పారిశ్రామికవేత్త నల్లి కుప్పు స్వామి చెట్టి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా కెఎస్.రవికుమార్ మాట్లాడుతూ ఫిలింఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అవార్డులు కళాకారుల ప్రతిభను ప్రోత్సాహిస్తాయని తెలిపారు. ప్రతియేటా అవార్డులు ప్రదానం చేస్తున్నందుకు ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులను అభినందించారు. ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి తాను అందుకున్న తొలి అవార్డు ఇదేనని తెలిపారు.
ఉత్తమ నటుడు అవార్డును జయంకొండాన్ చిత్రానికి వినయ్ అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా కుచేలన్ చిత్రానికి పశుపతి అవార్డును అందుకున్నారు. అదేవిధంగా తెలుగు, మలయాళం కళాకారులకు కూడా అవార్డులు అందజేశారు. ముందుగా ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి.మురళి స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ సావనీర్‌ను జయచిత్ర ఆవిష్కరించారు.


Click it and Unblock the Notifications











