మణిరత్నంతో నష్టపోయా, అయినా భరిస్తా : లింగుస్వామి
ఆయన కడలి చిత్రాన్ని తమిళనాడులోని మూడు ఏరియాలు...చెన్నై, మధురై, కోవైలలో డిస్ట్రిబ్యూట్ చేసారు. రూ. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కడలి చిత్రం ఫిబ్రవరి 1న విడుదలై బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా అసలు ఎవరికీ నచ్చలేదు. మణిరత్నం అభిమానులను కూడా ఈచిత్రం నిరాశ పరిచింది. దీంతో సినిమాకు పెట్టిన పెట్టుబడి రాక పోగా నష్టాల్లో కూరుకుపోయింది.
ఈ నేపథ్యంలో కడలి డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్న లింగుస్వామి కూడా నష్టపోయాడు. దీనిపై ఆయన స్పందిస్తూ 'ఇతర డిస్ట్రిబ్యూటర్ల వలె మణిరత్నం ఇంటికి వెళ్లి తాను నష్టపోయిన డబ్బు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేయను. అలా చేయడం ధర్మం కూడా కాదు. సినిమా అనేది వ్యాపారం. ఇందులో లాభ నష్టాలు సర్వ సాధారణం' అని చెప్పుకొచ్చారు.
'కడలి సినిమాకు మేము పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా తిరిగి రాబట్టుకోలేక పోయాము. సినిమా బాగా ఆడుతుందనే నమ్మకంతోనే మొదట్లో పంపిణీ హక్కులు కొనుగోలు చేసాం. కానీ మా అంచనాలు తారుమారయ్యాయి. ఈ సినిమాపై మేము రూ. 10 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాం. కానీ రూ.2 కోట్లు కూడా తిరిగి రాలేదు' అని డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు గతంలో మీడియాకు వెల్లడించారు.
అయితే మణిరత్నం మాత్రం తాను డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు. తన సొంత బేనర్ మద్రాస్ టాకీస్ పై సినిమాను నిర్మించాను. ఆ తర్వాత దాన్ని జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వారికి అమ్మాను. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వారి దగ్గర నుండే డిస్ట్రిబ్యూటర్లు సినిమా హక్కులను కొనుగోలు చేసారు. అందు వల్ల తాను గానీ, తన సంస్థ గానీ ఈ నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదని స్పష్టం చేస్తున్నారు. పలువురు డిస్టిబ్యూటర్లు మణిరత్నం ఇంటికి వెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండటంతో ఆయనకు పోలీసు ప్రొటక్షన్ కూడా ఏర్పాటు చేసారు.


Click it and Unblock the Notifications












