కోర్టు కేసు తేలాకే విడుదల చేస్తామన్న నిర్మాత
మార్చి 16వ తేదీనే విడుదల కావాల్సిన 'లవ్ జర్నీ' మూవీ కోర్టు కేసు కారణంగా ఆగి పోయిన విషయం తెలిసిందే. చెన్నై హైకోర్టులో 'లవ్ జర్నీ' చిత్రానికి సంబంధించిన కేసు వేయడంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్టుగా చిత్ర నిర్మాత జక్కుల నాగేశ్వరరావు తెలియజేశారు. జై, షాజన్‌పదంసి, కలర్స్ స్వాతి ప్రధానపాత్రధారులుగా జె.ఎన్.ఆర్ పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై తెలుగులో అనువదిస్తున్న చిత్రం 'లవ్ జర్నీ'. తమిళంలో శ్రీపతి రంగస్వామి దర్శకత్వంలో నిర్మించిన 'కనిమొళి' చిత్రాన్ని తెలుగులో 'లవ్‌జర్నీ'గా అనువదించారు. ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించిన తరువాత తమిళంలో నిర్మించిన మరో నిర్మాత కోర్టుకు వెళ్ళడంతో తెలుగు అనువాద చిత్రం విడుదలకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ తమిళ నిర్మాత శివ ల్యాబ్ క్లియరెన్స్ లెటర్ చూసి తాను తెలుగు హక్కులను కొనుగోలు చేశానని, ఆయనకు మరో నిర్మాతకు ఉన్న ఆర్థిక లావాదేవీలు తనకు తెలియవని, ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టుకు ఎక్కడంతో విడుదల కావలసిన 'లవ్‌జర్నీ' విడుదలను వాయిదా వేశామని, కోర్టు అనుమతి ఇచ్చాకే చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications











