టైమ్ కలిసి రావటం ఇదే...వివాదం అనుకోకండా మొదలైంది (వీడియో)
బెంగుళూరు : సినిమా అనేది ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఫక్తు వ్యాపారం. దాంతో తాము పెట్టిన పెట్టుబడి, ఎంతో కొంత లాభం పొందటానికి దర్శక,నిర్మాతలు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ చేస్తూంటారు. అవకాసముంటే సినిమాను వివాదం చేసి నాలుగు మీడియా ఛానెల్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నం చేసి అమ్ముకుంటూంటారు. ఇప్పుడు అలాంటి వివాదాస్పద అంశమే ఒకటి సినిమా వారికి దొరికింది. అది మరేదో కాదు ఒకప్పటి ప్రముఖ హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం చరిత్ర.

ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'అమ్మ'. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కన్నడ నటి రాగిణి ద్వివేది టైటిల్ పాత్ర పోషిస్తుంది. 'మై హూ రజనీకాంత్' చిత్రాన్ని రూపొందించి వార్తల్లో నిలిచిన ఫైసల్ సైఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ముంబయి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో 'అమ్మ' చిత్రీకరణ దాదాపుగా పూర్తిచేశారు. ఇప్పుడు జయలలిత వ్యవహారం హాట్ టాపిక్ కావడంతో సినిమాను భారీ ధరకు అమ్మాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.
ఈ చిత్రం టీజర్ ఇక్కడ చూడండి
కానీ తాజాగా జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుపాలయ్యారు. ఈ కొత్త సంగతుల్ని కూడా చిత్రీకరించడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు. ''ఇది జయలలిత ఆత్మకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం కాదు. కానీ ఆమెను తలపించేలా ఉంటుంది. ఇలాంటి పాత్ర పోషించడం నా అదృష్టం''అని చెబుతోంది చిత్ర కథానాయిక రాగిణి.
ఈ సినిమాకు సంబంధించిన విషయాల్ని జయ అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి రాగిణి మాట్లాడుతూ ''ప్రస్తుతం ఈ సినిమా విమర్శల్ని ఎదుర్కొనే పరిస్థితులే ఉన్నాయి. కానీ సినిమా చూశాకా అలాంటి పరిస్థితి రాదని నా నమ్మకం''అని చెప్పింది.


Click it and Unblock the Notifications











