భార్య, పిల్లల్ని వదలడం లేదు.. డీజీపీకి రాజీవ్ కనకాల, శివ బాలాజీ ఫిర్యాదు
సరదాగా కాసేపు నవ్వుకునేందుకు సృష్టించిన మీమ్స్, ట్రోలింగ్ అనే సోషల్ మీడియా ఎలిమెంట్స్ ఇప్పుడు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రత్యేకించి సినీ, రాజకీయాల్లోని కొందరు వ్యక్తులను టార్గెట్ చేయడానికి ప్రత్యర్ధులు ఈ మీమ్స్, ట్రోలింగ్‌ను ఆయుధంగా వాడుతున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అన్న సూక్తిని అనుసరించి .. ఒక పరిమితికి మించిన ఏదైనా సరే వెగటు పుట్టిస్తుంది. ఎదుటి వ్యక్తి బాధపడనంత వరకు మీమ్స్, ట్రోలింగ్‌లో ఏమైనా చేసుకోవచ్చు. కానీ అసభ్యంగా దూషించడానికి, పరువు ప్రతిష్టలపై దెబ్బ కొట్టడానికి వీటిని వినియోగించడం ఈ మధ్య ఎక్కువైంది.
కొందరు రాజకీయ నాయకులు, సినీనటులు ఎక్కువగా ట్రోలింగ్ బాధితులుగా మారుతున్నారు. ఓ రెండు ఫోటోలు, కాస్తంత ఎడిటింగ్, నాలుగు ముక్కలు రాస్తే చాలు అదే పెద్ద వార్తై కూర్చొంటోంది. అయితే ఈ ట్రోలింగ్ దెబ్బకు చాలా మంది లోలోపల కుమిలిపోతున్నారు. పోనీ బయటికొచ్చి ఫిర్యాదు చేద్దామా అంటే ఈసారి ఎలా రెచ్చిపోతారోనని భయంతో చాలా మంది బాధను భరిస్తున్నారు. కానీ అంతా ఒకే విధంగా ఉండరు కదా.. 10 మందిలో 9 మంది మాట్లాడకపోయినా ఒకడు మాట్లాడేవాడు ఉంటాడు.

కొందరు ప్రముఖులు తమపై జరిగే ట్రోలింగ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా సైబర్ పోలీసులను ఆశ్రయించిన ఉదంతాలెన్నో. సినీనటి, స్టార్ యాంకర్ అనసూయ అయితే తనను ఉద్దేశించి చిన్న పదం తప్పుగా మాట్లాడినా ఊరుకునేవారు కాదు. లైవ్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తారు. దీంతో ట్రోలర్స్ అనసూయ జోలికి వెళ్లడానికే భయపడతారు. అందరూ అంత డేర్‌గా ఉండకపోవచ్చు.. కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా.
సినీనటుల విషయానికి వస్తే.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాలలో పెట్టే థంబ్‌నైల్స్ చూస్తే దిమ్మతిరిగేలా ఉంటాయి. లోపల మేటర్ లేకున్నా.. ఏదో ఉంది అనిపించేలా హెడ్డింగ్స్ పెట్టి జనాలను ఆకర్షిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో పెట్టే థంబ్‌నైల్స్ , రాసే రాతలు దారుణంగా ఉంటాయి. నటీనటుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోయి .. వారి ఇంట్లోని కుటుంబ సభ్యులను.. చివరికి మహిళలను, చిన్నారులను సైతం రోడ్డుకీడుస్తున్నారు . ఇలాంటి ట్రోలింగ్‌తో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు మానసికంగా కృంగిపోతున్నారు.
వందల్లో ఉండే ఈ యూట్యూబ్ ఛానెళ్లు ఎక్కడ నుంచి నడుస్తున్నాయో, ఎవరు నడుపుతున్నారో తెలియదు. చాలా వరకు సినీ జనాలు వీటిని పట్టించుకోరు.. కానీ ఈ మధ్య శృతి మించుతుండటంతో మా అధ్యక్షుడు మంచు విష్ణు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని ఛానెళ్లను టెర్మినెట్ చేయించారు కూడా. తాజాగా నటులు రాజీవ్ కనకాల, శివబాలాజీ, శివకృష్ణలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ.. పనిగట్టుకుని ట్రోలింగుకు దిగే ఛానెళ్లను గుర్తించామని, దాదాపు 200 ఛానెళ్ల లిస్టును తయారుచేశామన్నారు.
డబ్బు కోసం, వ్యూస్ కోసం కొందరు మహిళల గౌరవానికి భంగం కలిగేలా ట్రోలింగ్‌కు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అప్పటి మీడియా చాలా హుందాగా ఉండేదని .. కానీ ఇప్పుడు కుప్పలు తెప్పలుగా ఛానెల్స్ పుట్టుకొస్తున్నాయని తెలిపారు. రూ.8 వేలు, రూ.10 వేల కోసం ఇలా చేస్తున్నారని.. కానీ ఒక లెవల్ వరకు తట్టుకోగలుగుతామని , ఇది ఏమాత్రం మంచిది కాదని వారు తెలిపారు. అసోసియేషన్ సభ్యులంతా ఓ కుటుంబంలా ఉంటున్నామని.. వారిలో ఎవరిక ఆపద వచ్చినా, సమస్యలు ఎదురైనా సమిష్టిగా వాటిని ఎదుర్కొంటామన్నారు.


Click it and Unblock the Notifications











