ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం.. అందరి ముందు చిరంజీవికి జీవిత క్షమాపణలు
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగంపై రాజ శేఖర్ కౌంటర్ వేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

మంచి మైకులో.. చెడు చెవిలో
మా లో అంతర్గత విభేదాల గురించి అందరికీ తెలిసిందే. నరేష్, రాజశేఖర్ మీడియా ముందుకు రావడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూశాం. వీటిపై చిరంజీవి మాట్లాడుతూ.. మంచి విషయాలు ఉంటే మైక్‌లో చెప్పుకొందాం. చెడు విషయాలు ఉంటే చెవిలో చెప్పుకొందామంటూ సలహా ఇచ్చాడు. విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగుదామని అందరికీ సూచించారు.

రాజశేఖర్ ఫైర్..
అనంతరం మైకు అందుకున్న రాజశేఖర్.. చిరు మాటలను, ప్రసంగాన్ని వేలెత్తి చూపినట్టు మాట్లాడాడు. నిప్పును దాచి పెడితే పొగ రాకుండా ఉండదని, గత సభ్యులు బాగా చేయలేదనే, తమను గెలిపించారని అలాంటప్పుడు వారు బాగా చేశారని ఎలా చెబుతారంటూ చెప్పుకొచ్చాడు. తనకు బయటకు ఒకలా లోపల ఇంకోలా మాట్లాడటం రాదని చెబుతూ.. సభ నుంచి బయటకు వెళ్లిపోయాడు.

చిరు ఆదేశాల మేరకే..
మా అంటే ఏంటో.. ఆర్టిస్ట్‌ల గురించి చిరంజీవి, మోహన్ బాబు నేర్పించారు..నేర్పించుకున్నానని తెలిపింది. ప్రతీ చోటా గొడవలు వస్తూనే ఉంటాయి. తాము కూడా మనుషులమేనని చెప్పుకొచ్చింది. మా సినిమాలపై విమర్శలు చేయండి కానీ వ్యక్తిగతంగా చేయకండని మీడియాను కోరింది. డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరగాలని చిరు ఆదేశించారని, ప్రతీ ఏటా జరుగుతూ వస్తోన్న కార్యక్రమాన్ని ఆపకూడదని సూచించారు అందుకే ఈ రోజు ఈ ఈవెంట్ జరిగింది.. దీనికి కారణం చిరంజీవి గారేనని జీవిత తెలిపింది.

అందరి ముందే క్షమాపణలు..
రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం.. ఆయనకు లోపల ఏది ఉంటే అది మాట్లాడేస్తాడని చెప్పుకొచ్చింది. చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది. అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్లాలనేది తమ కోరిక అని, దాని కోసం తాము పోరాటం చేస్తున్నామని తెలిపింది. నరేష్‌కు, తమకు ఎలాంటి విభేదాలు, గొడవలు లేవని తెలిపింది. అందరం కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











