రంజుగా ‘మా’ ఎలక్షన్స్: నరేష్, జీవిత, రాజశేఖర్ ప్యానల్ మేనిఫెస్టో ఇదే...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా మరోసారి పదవిలో కొనసాగేందుకు బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా నరేష్ రంగంలోకి దిగారు. నరేష్ ప్యానల్ తరుపున జీవిత, రాజశేఖర్, శివబాలాజీ తదితరులు బరిలో నిలిచారు.
మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నరేష్ ప్యానల్ తమ ప్యానల్ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

-మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల గౌరవం ఇనుమడింపజేసేలా సభ్యుల మధ్య సద్భావన పెంపొందించడం.
-సభ్యులు చేసే పనుల్లో పారదర్శకత, జవాబుదారీ తనం కలిగి ఉండటం, జమా ఖర్చులు సభ్యులకు వివరించడం.
-సభ్యులకు ఫోన్ హెల్ప్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటాం. అవసరం అయితే ఛాంబర్ వద్దకు వచ్చి కలుస్తాం, ప్రతి నెలలో ఒక రోజు ఫిక్స్ చేసి ఆ రోజు కలవడానికి అందుబాటులో ఉంటాం. అత్యవసర పరిస్థితుల్లో 24/7 అందుబాటులో ఉంటాం.
-వెల్ఫేర్ కమిటీ సర్వే ద్వారా అన్ని రకాల పథకాలకు పునాది వేయడం జరిగింది. సభ్యుల కోరిక మేరకు రెండో సారి సర్వే చేసి వెల్ఫేర్ పథకాలు పెంచడం జరుగుతుంది.
*పెన్షన్ రూ. 6 వేలు
*మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్
*ఎడ్యుకేషన్ సపోర్ట్ కెజి టు పీజీ
*కళ్యాణ లక్ష్మి రూ. లక్ష నూటపదహార్లు
*బైకులు, స్కూటీలు
*పెన్షన్ పథకాన్ని ఏ ఆధారం లేని ఒంటరి మహిళకు, ఒంటరి తల్లికి పెంచుతున్నాం.
-మాకు కళాకారుల తపన తెలుసు. తమను తాము వెండితెరపై చూసుకోవాలనే కళాకారుల తపన, మంచి క్యారెక్టర్ చేయలేని వారి ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని జాబ్ కమిటీని విస్తరిస్తాం. 'మా' సభ్యులకు అవకాశాలు దొరికేందుకు సిన్సియర్‌గా కృషి చేస్తాం. 'మా' మెంబర్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్ కౌన్సిల్, స్క్రిప్టు రైటర్లు, కో డైరెక్టర్లను కలవడం జరిగింది. వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది.
అన్నపూర్ణమ్మ బిజీ ఆర్టిస్ట్ అవ్వడానికి 'మా' కృషి కూడా ఉంది. వీరే కాకుండా 30 మంది ఆ ఆర్టిస్టులకు చాలా గ్యాప్ తర్వాత అవకాశాలు రావడానికి మేము చేసిన కృషి హితోదికం. మేము వినూత్నంగా ఆలోచించి, మా వంతు కృషి చేసి తద్వారా మా మెంబర్లకు క్యారెక్టర్లు, అవకాశాలు దక్కేలా చేస్తాం.
-మహిళా ఆర్టిస్టులకు ఎదురయ్యే సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా సర్వసాధారణం అయ్యాయి. వారి సమస్యల పరిష్కారానికి తగు విధంగా కృషి చేసి త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.
-'మా' సొంత భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరించి... ఈ టర్మ్ లోనే నిర్మించే ప్రయత్నం చేస్తాం.
-'మా' ఆర్టిస్టులందరూ సొంత ఇళ్లు కలిగి ఉండాలని మా కల. ఈ కలను సాకారం చేసేందుకు కో పరేటివ్ హౌసింగ్ స్కీం, గవర్నమెంటు వారి డబల్ బెడ్రూం స్కీం ద్వారా లబ్ది పొందడానికి గట్టిగా కృషి చేస్తాం.
-ప్రతి ఒక్కరూ వయసైపోయాక ప్రశాంతమైన, నిశ్చింత జీవితాన్ని కోరుకుంటారు. వయో వృద్ధులైన ఆర్టిస్టుల కోసం కొన్ని ఇళ్ల నిర్మాణాలు ఈ టర్మ్ లో చేయాలనేది మా కోరిక.
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల స్కీముల ద్వారా మా మెంబర్స్ లబ్ది పొందేలా మేము కృషి చేస్తాం.


Click it and Unblock the Notifications











