జీవిత మోసం చేసింది.. ఆ మాటతో గుండెలో గుచ్చేసింది.. క్షుద్ర రాజకీయం అంటూ వీకే నరేష్ ఆగ్రహం
తెలుగు సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్టు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, ప్రచారం ఊపందుకొన్నది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు చేసుకొంటున్న విమర్శలు, ప్రతి విమర్శలు రంజుగా మార్చాయి. మంచు విష్ణు ప్యానెల్‌కు పూర్తిస్థాయి మద్దతు తెలియజేస్తూ వీకే నరేష్ మీడియాతో ముచ్చటించారు. మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్, జీవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వీకే నరేష్ మాట్లాడుతూ..

జీవితకు మంచి హోదా కల్పించాం
గత ఎన్నికల్లో జీవితను కీలక పదవికి పోటీ చేయించాం. ఆ సమయంలో రాజశేఖర్‌ను కూడా ప్యానెల్‌లో చేర్చాలని జీవిత సూచిస్తే.. రెండు కీలక పదవుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి చోటు కల్పించకూడదనే విషయం తెలిసినా.. ఒప్పుకొన్నాం. అలా మా సంఘం కార్యవర్గంలో జీవితకు మంచి హోదా కల్పించాం అని వీకే నరేష్ అన్నారు.

రాజశేఖర్‌ను సస్పెండ్ చేయడంతో
అలాగే హీరో రాజశేఖర్ వ్యవహరించిన తీరు వల్ల ఆయన సస్పెండ్ అయ్యారు. అయితే మా కార్యవర్గంలోని సభ్యుడు సస్పెండ్ కావడం బాధ కలిగించింది. అయితే మా కార్యవర్గ పనికాలం చేదు అనుభవంతో ముగియకూడదనే కారణంతో స్వయంగా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుతో మాట్లాడి రాజశేఖర్‌పై సస్పెన్షన్ వేటు ఎత్తివేసేలా చర్యలు తీసుకొన్నాను. అలా జీవిత, రాజశేఖర్‌ను బాగా చూసుకొన్నాను అని వీకే నరేష్ చెప్పారు.

ఆ మూడు పదవులు విష్ణు ప్యానెల్‌కే
గత కార్యవర్గంలో ముగ్గురు నలుగురు తప్పుడు వ్యక్తులను పెట్టుకొని అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. కాబట్టి ఈసారి జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి పదవులు ఒకే ప్యానెల్‌కు ఇవ్వండి. అది మా మంచు విష్ణు ప్యానెల్‌లో ఉండేలా సభ్యులు నిర్ణయం తీసుకోండి. ఇతర ప్యానెల్‌కు ఆ అవకాశం ఇస్తే మన జుట్టు వేరే వాళ్ల చేతికి వెళ్తుంది. కాబట్టి ఓటు వేసే సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి అంటూ వీకే నరేష్ సూచించారు.

జీవిత ప్లేట్ మార్చి ప్రకాశ్ రాజ్ వైపుకు
ప్రస్తుత మా ఎన్నికల్లో జీవితను మా ప్యానెల్‌లో ఉండాలని ఆహ్వానించాం. మంచి పోస్టు ఇస్తామని కానీ ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు వెళ్లారు. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. కానీ నిన్న ఏదో టెలివిజన్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. అటువైపు వీకే నరేష్ ఉన్నారు కాబట్టి నేను ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోకి వెళ్లానని చెప్పారు. ఆ మాట నా గుండెల్లో పొడిచినట్టు అయింది. నేను చెల్లమ్మా అనుకొన్న వ్యక్తి, ఓ మహిల అలాంటి మాటలు అనడం చాలా బాధగా ఉంది అని వీకే నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఓటు వేయవద్దు అని వీకే నరేష్ సూచించారు.
Recommended Video

స్పాన్సర్ టెర్రరిజం అంటూ వీకే నరేష్
మా ఎన్నికలు ఫ్రెండ్లీగా జరుగుతాయి. కానీ ఓటు మాత్రం ఫ్రెండ్లీగా వేయవద్దు. నాకు ఇదే చివరి మీటింగ్ అనుకొంటున్నాను. కానీ ఎవరైనా నన్ను కెలికితే.. మళ్లీ ఘాటుగా వస్తాను. కొందరు ఇక్కడ క్షుద్ర రాజకీయం చేస్తున్నారు. స్పాన్సర్ టెర్రరిజం చేస్తున్నారు అంటూ వీకే నరేష్ విమర్శలు చేశారు. అయితే స్పాన్సర్ టెర్రరిజం అనేది ఎవరు చేస్తున్నారనే విషయాన్ని బయటపెట్టాలని మీడియా కోరగా.. ఆ ప్రశ్నను దాటవేసేందుకు ప్రయత్నించారు.


Click it and Unblock the Notifications