Manchu Vishnu: మా ఎన్నికలపై మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం.. ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ ఎఫెక్ట్?
ఇటీవలే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు (Telugu Film Chamber Of Commerce Election) రసవత్తరంగా ముగిశాయి. హోరా హోరీగా సాగిన ఈ పోరులో అగ్ర నిర్మాత సి. కల్యాణ్ పై మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గెలిచి విజయ కేతనం ఎగురవేశారు. జూలై 30న జరిగిన ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ గెలవగా.. ఆయన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి మా (MAA Elections) ఎన్నికలపై పడింది. ప్రస్తుతం మా అసోసియేషన్ (Movie Artist Association)కు అధ్యక్షుడుగా ఉన్న హీరో మంచు విష్ణు తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జోరుగా సాగిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC Elections 2023) ఎన్నికల్లో దిల్ రాజు గెలిచి అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఎన్నికల ప్రభావం మా ఎన్నికలపై పడినట్లుగా తెలుస్తోంది. 2021 అక్టోబర్ లో జరిగిన మా ఎలక్షన్స్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వరిస్తున్న విష్ణు తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట.

సాధారణంగా రెండేళ్లకు మా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. 2021 అక్టోబర్ లో ఈ ఎలక్షన్స్ నిర్వహించగా.. ఈ 2023 సంవత్సరంలో సెప్టెంబర్ లో ఎన్నికలు జరగాలి. అయితే వాటిని వచ్చే ఏడాది అంటే 2024 సంవత్సరంలో మే నెలలో నిర్వహించాలని తీర్మానించినట్లు పలువురు సభ్యుల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అసోసియేషన్ ఆడిట్ సమస్యలే కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట.
తర్వాతి మా ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదనే నిర్ణయాన్ని సభ్యులకు మంచు విష్ణు తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు త్వరలో కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల గడువు పూర్తయ్యే లోగా సభ్యులకు ఇచ్చిన హామీలన్నింటిని పూర్తి చేయాలనే ఆలోచనతో మంచు విష్ణు ఉన్నట్లు ఇన్ సైడ్ నుంచి వచ్చిన సమాచారం.
ఇదిలా ఉంటే మంచు విష్ణు హీరోగా గతేడాది జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా అంతగా సక్సెస్ సాధించలేదు. మంచు విష్ణు ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నట్లు ఇదివరకు మోహన్ బాబు ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. కానీ, దానిపై ఇంతరవకు స్పష్టత రాలేదు.


Click it and Unblock the Notifications











