»   »  ఇవా తెలుగు సినిమా కథలు..?

ఇవా తెలుగు సినిమా కథలు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో ఆయన సుప్రసిద్ధ నిర్మాత. తర్వాత క్రమంగా సినీపరిశ్రమకు దూరమయ్యారు. గత పాతికేళ్లుగా ఆయన ఏడాదికి ఒకటీ రెండు సినిమాలు మాత్రం చూడగలుగుతున్నారు. అలాంటిది 2005 సంవత్సరంలో విడుదలైన అన్ని సినిమాలలో ఏరిన 48 ఆణిముత్యాలను ఒక్కసారిగా చూడాల్సిన పరిస్థితి తటస్థించింది ఆయనకు. మొత్తం 48 సినిమాలని ఓపిగ్గా చూసి.. వాటిలో మంచి వాటిని ఎంపిక చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. తెలుగు సినిమాలు ఇలా అయిపోయాయేమిటీ అని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆయనే - అలనాటి సుప్రసిద్ధ నిర్మాత డూండీ.

తెలుగు సినిమాలో హాలీవుడ్‌ పోకడలను పరిచయం చేసిన నిర్మాత ఆయన. కృష్ణను సూపర్‌స్టార్‌ని చేసిన జేమ్స్‌ బాండ్‌, కౌబాయ్‌ పాత్రలలో చూపించిన డూండీ ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. అయితే, పాతికేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే నంది పురస్కారాలకు సంబంధించి 2005 స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఆయన ఎంపికయ్యారు. తాను చూసిన చిత్రాలలో మంచి చెడుల గురించి ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

"ఒక్కటి మాత్రం నిజం. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమాలైనా సాంకేతికపరంగా బాగున్నాయి. కానీ కథల విషయానికొస్తే.. చాలా దారుణంగా ఉన్నాయి. పెద్ద హీరోల చిత్రాలలో కథకు ప్రాధాన్యమే లేదు. మితిమీరిన హింసని చూపిస్తున్నారు. హీరో వందల మందిని నరికిపారేస్తున్నాడు. పోలీసులూ, చట్టం లాంటి ప్రసక్తే లేదు. అరటి తూటల్ని నరికినట్టు జనాన్ని నరికేస్తున్న హీరో చివరికి సమాజాన్ని రక్షించేశానంటూ పోజు పెట్టేస్తున్నాడు. అతడు చిత్రంలో అయితే హీరో - ఒక ప్రొఫెషనల్‌ కిల్లర్‌. భద్ర, అతనొక్కడే చిత్రాలలో తలలు తెగిపడటం వంటి దృశ్యాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇదేం ధోరణో అర్థం కావడం లేదు.

సినిమాలలో ద్వంద్వార్థాలు దారుణంగా ఉన్నాయి. టీచర్లను చాలా అగౌరంగా చూపిస్తున్నారు. లేడీ లెక్చరర్లను బొడ్డు కింద చీరలు కట్టి మరీ చూపిస్తున్నారు. అందుకే ఇలాంటి పెడ ధోరణులకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జ్యూరీ కమిటీ నివేదిక సమర్పించింది.

వచ్చిన చిత్రాలలో పోతేపోనీ.. కాస్త సామాజిక స్పృహతో ఉంది. అందుకే దానికి బంగారు నంది ప్రకటించాం. అది మినహా జాతీయ సమగ్రత అవార్డుకి తగిన తెలుగు సినిమా 2005 సంవత్సరంలో లేకపోవడం చాలా విడ్డూరంగా అనిపించింది. చిన్నా, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్నీ మూసపోసిన కథలతోనే తయారవుతున్నాయనిపించింది అని వివరించారు డూండీ. వినే వాళ్లెవ్వరు?

మరిన్నికథనాలు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X