ఫిలిం ఫేర్ అవార్డ్ ల్లోనూ 'మగధీర' దే రికార్డు
రికార్డుల్ని తిరగరాసిన 'మగధీర' చిత్రం ఫిలింఫేర్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఏకంగా ఆరు ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. 57వ ఐడియా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కన్నుల పండువగా జరిగింది. దీనికి సినీ పరిశ్రమలోని పెద్దలు, అభిమానులు హాజరయ్యారు. తెలుగు కేటగిరిలో మగధీర ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందుకుగాను చిత్ర నిర్మాత అల్లు అరవింద్ అవార్డును స్వీకరించారు. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి(మగధీర), ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ (మగధీర) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం.ఎం.కీరవాణి(మగధీర) ఎంపికవగా, ఆయన తరఫున అల్లు అరవింద్ అవార్డు తీసుకున్నారు. అనూజ్ గురువారా ఉత్తమ గాయకుడిగా(మగధీర చిత్రంలోని పంచదార బొమ్మ), ఉత్తమ ఛాయాగ్రాహకుడి అవార్డును సెంథిల్(మగధీర) అవార్డులు దక్కాయి.
అరుంధతి చిత్రానికి గాను అనుష్కకు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె తరఫున కెమెరామెన్ సెంథిల్ కుమార్ అవార్డు తీసుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా సోనూసూద్(అరుంధతి), ఉత్తమ సహాయ నటిగా రమ్యకృష్ణ(కొంచెం ఇష్టం-కొంచెం కష్టం) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి(మహాత్మ చిత్రంలోని ఇందిరమ్మ ఇంటి పేరు పాట) ఎంపికయ్యారు. సిరివెన్నెల రాకపోవడంతో ఆయన కుమారుడికి అవార్డును అందజేశారు. ప్రియా హిమేష్ కు ఉత్తమ గాయని(ఆర్య-2 చిత్రంలోని రింగ రింగా పాట), ఉత్తమ నూతన హీరో అవార్డుకు నాగచైతన్య(జోష్) ఎంపికయ్యారు. చైతన్య తరఫున నటుడు సుశాంత్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును ప్రేమ్ రక్షిత్(ఆర్య-2లో మిస్టర్ పర్ ఫెక్ట్ పాట) దక్కించుకున్నారు. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకు ప్రత్యేక జ్యూరీ అవార్డు ఇచ్చారు. ఈ విజేతలందరికీ ధట్స్ తెలుగు అభినందనలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











