టాప్ చైర్ లో 'మగధీర'
'అరుంధతి', 'కిక్' 'కింగ్" చిత్రాల తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు సినీమా ఇండస్ట్రీ వారికి 'మగధీర' బాక్సాఫీస్ విజయకేతనం ఎగురవేయడం కొత్త ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. కేవలం 25 రోజుల్లో 58 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు సినీమా చరిత్రలో సరికొత్త రికార్డుగా అభివర్ణిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే 'మగధీర' ముందు, ఆ తర్వాత వచ్చిన చిత్రాల కంటే తనదే పైచేయి అని నిరూపించుకుంటూ విజయోత్సాహంతో 50 రోజుల దిశగా దూసుకుపోతోంది. వర్షాలు, పండుగలు, బ్లాక్ టిక్కెట్లు కారణంగా తొలి మూడు వారాల్లో థియేటర్లకు దూరంగా ఉండిపోయిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ చిత్రాన్ని చేరువ చేసేందుకు హైద్రాబాద్ లోని మరో 9 థియేటర్లను అదనంగా చేర్చారు. దీంతో 'మగధీర' ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్య 26 నుంచి 35కు చేరింది.
'మగధీర' తర్వాత భారీ అంచనాలతో విడుదలైన విక్రమ్ 'మల్లన్న' చిత్రం మంచి ఓపినింగ్స్ రాబట్టుకుంది. అయితే రెండేళ్ల నిరీక్షణకు తగ్గట్టుగా సినిమా లేదనే మాటలకు ప్రతికూలంగా మారుతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రవితేజ 'ఆంజనేయులు' చిత్రం యావరేజ్ టాక్ తో నిలకడైన కలెక్షన్లు దక్కించుకుంటోంది. 'లైఫ్ స్టైల్', 'స్నేహితుడా' చిత్రాలు దర్శకుల ప్రతిభను చాటుతున్నాయనే టాక్ వచ్చినప్పటికీ గణనీయంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో వెనుకబడినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే వారంలో నాగచైతన్య 'జోష్' భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతుండగా, గోపీచంద్ 'శంఖం' (సెప్టెంబర్ 11), నారో రోహిత్ 'బాణం' (సెప్టెంబర్ 16), కమల్-వెంకటేష్ 'ఈనాడు' (సెప్టెంబర్ 18) దసరా బరిలో ఉన్నాయి. వీటికి తోడు రామ్ 'గణేష్' సెప్టెంబర్ 23న గానీ 24న గానీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











