twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ వైపు ప్రజాదరణ.. మరోవైపు వివాదాలు.. నలిగిపోతున్న మహానటి!

    By Rajababu
    |

    తెలుగు వారి అభిమాన నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ అశ్విన్‌పై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందనతో రికార్డు కలెక్షన్లను మహానటి సాధిస్తున్నది. ఇప్పటికే రూ.50 కోట్ల కలెక్షన్లకు చేరువైంది. అయితే మహానటి చిత్రం వాస్తవాలకు దూరంగా ఉందనే మరో వాదన కూడా వినిపిస్తున్నది. ఇటీవల ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనం చర్చనీయాంశమైంది. ఓ వర్గం ఆ కథనాన్ని సమర్థించగా, మరో వర్గం దానిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరాలు ఏకంగా సదరు పేపరుకు చెందిన వెబ్‌సైట్‌లో లింకు కూడా మాయమయ్యేంతగా ప్రభావితం చూపాయి. ఇదిలా ఉంటే, తాజాగా నిర్మాత ధోనెపూడి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదంగా మారింది.

    Recommended Video

    Kamal Hassan Says About Savitri's Life
     నిర్మాతను తప్పుగా చూపించారు

    నిర్మాతను తప్పుగా చూపించారు

    నిర్మాత దోనెపూడి కృష్ణమూర్తి గురించి మహానటిలో తప్పుగా చూపించారని, అందుకు ఆ చిత్ర యూనిట్ క్షమాపణ చెప్పాలని ఆయన కోడలు సరోజిని, మనవరాలు పద్మజ డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమ గర్వించే విధంగా చిత్రాలు నిర్మించిన జూనియర్ ఆర్టిస్టుగా జూనియర్ ఆర్టిస్టు సప్లయిర్‌గా చూపించడంతో మా కుటుంబం మనస్తాపం చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

    ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వివాదాస్పద కథనం ఇదే..

    సమష్టి కృషికి జోహార్‌!

    సమష్టి కృషికి జోహార్‌!

    మహానటి'... కొద్ది రోజులుగా స్మార్ట్‌ఫోన్‌లో ఘడియకో మెసేజ్‌తో సంచలనం రేపుతున్న సినిమా. 5 భాషల్లో మొత్తం 248 సినిమాల్లో నటించిన ఒక నటీ శిరోమణి గురించి, కేవలం ఒకే ఒక్క సినిమా వయసున్న యువ దర్శకుడు తీయాలనుకోవడం పెద్ద సాహసం. ‘మహానటి'తో నాగ్‌ అశ్విన్‌ ఆ సాహసం చేశారు.
    తెలుగు తెరపై కొత్త ప్రయోగాలు జరగడం లేదు, నిజాయతీగా సినిమా రూపకల్పన ప్రయత్నాలు జరగడం లేదు అని అనుకుంటున్న వేళ ఈ ప్రయత్నం ఓ కొత్త ఆశాకిరణం. అందుకు ముందుగా అతణ్ణీ, ఆయనకు అండగా నిలిచిన నిర్మాతలనూ అభినందించాలి. ఇలాంటి చిత్రాల నిర్మాణానికి అపారమైన అభిమానం, అంకితభావం ఉండాలి. నాగ్‌ అశ్విన్‌ బృందానికి అవి పుష్కలంగా ఉన్నాయనడానికి ‘మహానటి' మేకింగ్‌ ఉదాహరణ. ఆనాటి వాతావరణాన్ని తెరపై పునఃసృష్టించడానికి వేసిన సెట్లు, చేసిన మేకప్పు, తయారు చేసిన కాస్ట్యూమ్‌లు, సాహిత్యం, కలకాలం గుర్తుంచుకొనే కొన్ని మంచి డైలాగులు, పాత హిట్‌ పాటల బిట్స్‌ను మరోసారి చిత్రీకరించడం... ఆ రోజుల్లోకి తీసుకువెళతాయి. దానికి తగ్గట్లే కీర్తీ సురేశ్‌ అద్భుత నటన, అగ్ర తారలు ప్రేమతో చేసిన అతిథి పాత్రలు కచ్చితంగా కన్నులపండుగ. ‘మహానటి' గురించి ఇవాళ జనం ఇంతగా మాట్లాడుకోవడానికి అదే కారణం.

    మొదటి బయోపిక్ కాదు..

    మొదటి బయోపిక్ కాదు..

    నిజానికి, తెలుగులో బయోపిక్‌లు రావడం ఇదే ఆదీ కాదు, అంతమూ కాదు. టంగుటూరి ప్రకాశంపై ‘ఆంధ్రకేసరి' (1983), గిరిజన యోధుడిపై ‘కొమరం భీమ్‌' (1990), భారత రాజ్యాంగ నిర్మాతపై ‘డాక్టర్‌ అంబేద్కర్‌' (1992) లాంటివి వచ్చాయి. ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. ఒక తెలుగు సినీతారపై తెలుగులో వచ్చిన తొలి బయోపిక్‌ అనే ఘనత మాత్రం ‘మహానటి'దే.

    బయోపిక్‌లతో చిక్కే!
    అయితే, ఎవరన్నారో కానీ... బయోపిక్‌ అంటే అక్షరాలా భయోపిక్కే. వాస్తవాల ఆధారంగా సినిమా తీస్తే, ఆ బయోపిక్‌ తాలూకు వారసుల కోపానికి గురికావాల్సి వస్తుంది. పోనీ, వీలైన చోట్ల కాస్తంత భావోద్వేగాలు పండేలా సినిమాటిక్‌ లిబర్టీతో కల్పనను జోడిస్తే... అప్పుడు ప్రేక్షకుల మాటెలా ఉన్నా, చరిత్ర తెలిసినవాళ్ళు ఛీ కొట్టేస్తారు. కాబట్టి, జీవిత కథా చిత్రాలూ ఎప్పుడూ కత్తి మీద సామే. నాగ్‌ అశ్విన్‌ అలా రెండు వైపులా పదునైన కత్తిని పట్టుకొని, బాక్సాఫీస్‌ బరిలోకి దిగారు.

    ఈ సినిమాకు ఉన్న బలం సావిత్రి పట్ల ఇప్పటికీ సినీ ప్రియుల్లో ఉన్న అపార అభిమానం. ఈ సినిమాకు బలహీనతా అదే. ఎందుకంటే, సావిత్రి వీరాభిమానులకు ఆమె జీవితం, సినీజీవితం మీద అవగాహన, అంచనా ఉన్నాయి. కానీ, ఈ సినిమాలో జెమినీ గణేశన్‌ పాత్రను అటు పూర్తిగా విలన్‌గా చూపించలేక, ఇటు సావిత్రిదే తప్పనీ చెప్పలేక దర్శక, రచయితలు సతమతమైనట్లు కనిపిస్తుంది. దాంతో, రెండు పాత్రల జీవితాలనూ జరిగిన అసలు కథకు దగ్గరగా తెరపై చూపించలేకపోయా రన్నది నిష్ఠురసత్యం. రెండేళ్ళు రిసెర్చ్‌ చేసి తీశామన్న బయోపిక్‌లో కొన్నివాస్తవ విరుద్ధ అంశాలు, తప్పులు తెర మీదకు వచ్చేశాయి. నిజజీవిత కథ కాబట్టి, సావిత్రి జీవితంలో అలాగే జరిగిందని జనం పొరబడే ప్రమాదమూ తెచ్చేశాయి. అలాంటి కొన్ని ఇవిగో...

    పుట్టిన తేదీ... తప్పే!

    ‘చరిత్ర అడక్కు... తీసింది చూడు' అనే ఫక్కీలో సాగిందీ సినిమా. చివరలో వచ్చే టైటిల్‌ కార్డులో సావిత్రి పుట్టిన ఏడాది 1936 అన్నట్లు, ఆమె 300కు పైగా సినిమాల్లో నటించినట్లూ చూపెట్టారు. అయితే, నిజానికి సావిత్రి పుట్టింది 1935 డిసెంబర్‌ 6న. అయిదుభాషల్లోనూ ఆమె నటించిన సినిమాలన్నీ కలిపితే 248 మాత్రమే. నిజానికి ఈ చిత్ర దర్శకుడు తాము ఆధారపడ్డామని చెప్పిన సావిత్రి ఇంగ్లీషు బయోగ్రఫీ పుస్తకం ‘ఎ లెజెండరీ యాక్ర్టెస్‌... మహానటి సావిత్రి'లోనే ఈ వాస్తవాలు సాక్ష్యాధార సహితంగా ఉన్నాయి. సావిత్రి పుట్టింది 1935 డిసెంబర్‌ ఆరున అని ఆ నాటి జననాల రిజిస్టరు పుస్తకంలోని పేజీ ఫోటోకాపీతో సహా ఇంగ్లీషు పుస్తక రచయితలు నిరూపించారు.

    ఆమె అనలేదు! ఆయన అడగనూ లేదు!!

    సావిత్రే స్వయంగా చెప్పుకున్న తన జీవితకథ ప్రకారం సావిత్రి, జెమినీ గణేశన్‌లు గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళి చేసుకున్నది - 1952లో తమిళ ‘మనంపోల మాంగల్యం' సిన్మా షూటింగ్‌ టైమ్‌లో! ఆ పెళ్ళిని బాహాటం చేసి, వారిద్దరూ ఒకటైంది 1956 సెప్టెంబర్‌ 9వ తేదీన! అయితే, పెళ్ళయ్యాక సినిమాలు చేయనని సావిత్రి అన్నారన్నది వట్టి అభూత కల్పన. పైపెచ్చు, సినిమాలు చేయనని ఇంట్లో కూర్చున్న సావిత్రి దగ్గరకు విజయా వారి ప్రముఖ నిర్మాత చక్రపాణి వచ్చి, సినిమా చేయమని అడిగి కన్విన్స్‌ చేశారనీ, ఆ సినిమా మరేదో కాదు... ‘మాయాబజార్‌' అనీ ‘మహానటి' సినిమాలో చూపించింది మరో కట్టుకథ. అది జరిగినట్లు ఎక్కడా రికార్డు కాలేదు.

    సావిత్రి సినిమాలో భానుమతి సంఘటన

    సావిత్రి సినిమాలో భానుమతి సంఘటన

    అలాంటి సంఘటన జరిగింది నటి భానుమతి జీవితంలో! దర్శకుడు పి. రామకృష్ణారావుతో 1943 ఆగస్టు 8న ప్రేమపెళ్ళి అయ్యాక ఆమె నటించకుండా ఇంటి పట్టునే ఉంది. అప్పుడు ఆమె భర్తనూ, ఆమెనూ కన్విన్స్‌ చేసి మళ్ళీ వాహినీ వారి ‘స్వర్గసీమ' (1945)తో తెర పైకి తెచ్చింది - ప్రసిద్ధ దర్శక, నిర్మాత బి.ఎన్‌.రెడ్డి. ఆయన తరఫున ఆ రాయబారం నడిపింది రచయిత సముద్రాల సీనియర్‌, నటుడు ముదిగొండ లింగమూర్తి. ఇదంతా భానుమతి తన ఆత్మకథ ‘నాలో నేను'లో స్పష్టంగా చెప్పారు కూడా. మరి, భానుమతి జీవితాన్ని తలపించే ఆ ఘటనను ఇలా సావిత్రికి తెచ్చి అతుకుపెట్టారెందుకో!

    అలాగే, అసలు జరిగిన చరిత్ర చూస్తే ‘మాయాబజార్‌' చిత్ర నిర్మాణం 1955 చివరలోనే పట్టాలెక్కేసింది. ఆ తరువాతెప్పుడో 1956 చివరలో తమ పెళ్ళి సంగతి సావిత్రి బయటపెట్టింది. అంటే, అప్పటికే ‘మాయా బజార్‌' షూటింగ్‌ జరుగుతూ, ఏ తుది దశలోనో ఉందన్న మాట. కాబట్టి, సినిమాలు చేయకుండా ఇంట్లో కూర్చోనుంటే, చక్రపాణి వచ్చి సావిత్రిని ఒప్పించారనడం అతకని అబద్ధం. పైగా, అదే సీన్‌లో చక్రపాణి పాత్ర (ప్రకాశ్‌రాజ్‌) వచ్చి, సావిత్రిని (కీర్తీసురేశ్‌) సినిమాల్లో నటించమని అడగడానికి వచ్చినప్పుడు వెనకాల రేడియోలో ‘తోడికోడళ్ళు' (1957 జనవరి 11 రిలీజ్‌) పాట రావడం మరీ విడ్డూరం. ఒకవేళ ఆ సినిమా, ఆ పాటల రిలీజ్‌ నాటికి ‘మాయాబజార్‌' షూటింగే మొదలవలేదనుకుంటే, తరువాత రెండు నెలలకే 1957 మార్చి కల్లా అంత భారీ పౌరాణికం షూటింగ్‌ ముగించేసుకొని, ఎలా రిలీజైనట్టు?

    కన్నీటిబొట్లు.. కాదన్న ‘పద్మశ్రీ' ... రెండూ కల్పనే!

    అలాగే, ‘మాయాబజార్‌' షూటింగ్‌లో ‘నీ కోసమె నే జీవించునది...' పాట చిత్రీకరణలో గ్లిజరిన్‌ సీసా లేకపోవడంతో దర్శకుడు కె.వి. రెడ్డితో ఛాలెంజ్‌ చేసి మరీ, సావిత్రి కుడికంటి నుంచి రెండే చుక్కల కన్నీటిబొట్లు రాల్చిందన్న సంఘటన. తెరపై డ్రామా పండించే ఈ సీన్‌ ఏకంగా వాస్తవమని తలపించే, ఇంకా చెప్పాలంటే తలదన్నే ఓ అపూర్వ కల్పనా చమత్కృతి. ఆ సినిమాకు ఆద్యంతం పనిచేసి, ఇప్పటికీ మన మధ్య ఉన్న ప్రముఖులు సైతం అది వట్టి కల్పన అని స్పష్టం చేశారు.

    అదే విధంగా ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారం ప్రకటిస్తానంటే, భర్తకు రాకుండా తనకు ఇస్తే ఆయన బాధపడతాడని సావిత్రి వద్దన్నట్లు కూడా సినిమాలో చూపెట్టారు. అది కూడా ఎక్కడా చరిత్రలో నమోదు కాని అందమైన అబద్ధమే. సావిత్రి, ఎస్వీఆర్‌ లాంటి మహామహులకు వారికి ‘పద్మశ్రీ' లేదని ఎన్నో ఏళ్ళుగా అందరం ఆవేదన చెందుతుంటే, ఇస్తానంటే ఆమె వద్దన్నదనే కల్పన బయోపిక్‌లో ఎలా కరెక్టవుతుంది.

    1948... బెజవాడ - 1950... కాకినాడ ... మిక్స్‌!

    ఇక, సావిత్రి తన జీవితకథలోనే చెప్పుకున్న ప్రకారమే... పృథ్వీరాజ్‌ కపూర్‌ నాట్యకళాపరిషత్‌ ఉత్సవాలకు వచ్చి, నాటకంలో ఆమె అభినయాన్నిమెచ్చుకున్నది 1950 ఏప్రిల్‌లో, కాకినాడలో! ఇక, అక్కినేనిని చూడడానికి సావిత్రి ఉరికిన సంఘటన జరిగిందేమో 1948 జూన్‌లో బెజవాడలో! ‘బాలరాజు' (1948 ఫిబ్రవరి 26 రిలీజ్‌) టైమ్‌లో! కానీ, ఆ రెండు వేర్వేరు ఊళ్ళనూ, రెండు వేర్వేరు సంఘటనలనూ కలిపి, ఒకే సీన్‌లో ముడి వేసేశారీ సినిమాలో.

    పైగా, అక్కినేనిని చూడబోయి, సావిత్రి సైడు మురుగుకాలువలో పడింది ‘బాలరాజు' శతదినోత్సవ అభినందన సభ సమయంలో, అదీ బెజవాడ జైహింద్‌ టాకీస్‌ దగ్గర! ఇదీ బాగా తెలిసిన కథే. అంతేకానీ, ‘మహానటి'లో చూపినట్టు నటరాజ్‌ థియేటర్‌ కాదు. కానీ, సినిమాటిక్‌ లిబర్టీగా తెరపై చూస్తూ సర్దుకుపోవాలి.

    పుస్తకం రాసినా... రాయలేదన్నారేం!?

    అలాగే, ఈ సినిమాలో ఓ సందర్భంలో సమంత దగ్గరకు జి.వి.జి. అనే ప్రముఖ సినీ జర్నలిస్టు పాత్ర (‘వంగవీటి' ఫేమ్‌ వంశీ చాగంటి) వచ్చి, సావిత్రి కథ రాద్దామనుకొని రాయలేకపోయానంటూ, ఆ సమాచారం అంతా సమంతకు అప్పగించి వెళ్ళినట్లు చూపించారు. నిజానికి, అది సావిత్రి నిజజీవితంలో ఉన్న ప్రముఖ జర్నలిస్టు జి.వి.జి. కృష్ణ పాత్రే. అక్కినేని, సావిత్రి నటించిన ‘దేవదాసు' సినిమాలో ముసలి జమీందారు పెద్ద కొడుకు మహేన్‌గా, సావిత్రికి కొడుకు కాని కొడుకు పాత్ర వేసింది ఆ జి.వి.జి.నే. ఆ సంగతిని ‘మహానటి'లో డైలాగుల్లో చెప్పించారు కూడా! మరి, 1953లో రిలీజైన ‘దేవదాసు'లో కనీసం ఇరవై ఏళ్ళ పైన ఉండే కుర్రాడి పాత్ర వేసిన ఆ జి.వి.జి.కి, 1981లో ఈ సమాచారం సమంతకు ఇచ్చేశాడనుకొనే కల్పితకథ నాటికి 50 ఏళ్ళు, ఆ పైనే ఉండాలి. మరి, సినిమాకథలో అంత కల్పించినవారు, తీరా ఆ వయసు లాజిక్‌ను మర్చి, ఆ పాత్రనూ మరో కుర్ర జర్నలిస్టులా చూపడంలో ఔచిత్యం ఏమిటి?

    పైపెచ్చు, సావిత్రి బతికుండగానే ‘కథానాయిక కథ... సావిత్రి జీవిత చరిత్ర' పేరుతో ఆమె జీవితకథను జి.వి.జి. రాశారు. 1964 అక్టోబర్‌ నాటికే పుస్తకంగా ప్రచురించారు. ఇది కూడా సినీ ప్రియులందరికీ తెలుసు. మరి, తాను సావిత్రి కథను రాయలేకపోయానంటూ ఆ జి.వి.జి. పాత్రతో ఈ సినిమాలో అనిపించడం ఏమిటి? నిజజీవిత పాత్రనూ, వయసునూ, ఆఖరుకు జరిగిన విషయాన్నీ.. అన్నిటినీ ఇలా మార్చేసి చూపడం బయోపిక్‌ స్ఫూర్తికే విరుద్ధం.

    ఇంతకీ శంకరయ్య ఎవరు?

    ఇంతకీ శంకరయ్య ఎవరు?

    దాదాపు నాలుగున్నర దశాబ్దాలు బతికి, చనిపోయాక కూడా మరో మూడున్నర దశాబ్దాల పైగా జనం మనసులో చిరంజీవిగా బతికున్న ఓ మహానటి జీవితం మొత్తాన్ని మూడు గంటల్లో చూపించడం కష్టమే. అది ఒప్పుకు తీరాల్సిన విషయం. అయితే, ఈ సినిమా కోసం ఎన్నెన్నో సీన్లు తీసి, ఎడిటింగ్‌లో కత్తెరకు బలి చేసినట్లు, అర్ధంతరంగా మొదలై హఠాత్తుగా ముగిసిపోయే అనేక సీన్లు చెప్పకనే చెబుతుంటాయి. మద్దాలి సుశీల వచ్చి హీరో అక్కినేని నాగేశ్వరరావును స్టూడియోలో కలిసే సీన్‌ లాంటివి అందుకు ఉదాహరణ. స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ కేశవన్‌ (నటుడు నరేశ్‌) పాత్ర తాలూకు కథేమిటి, సావిత్రి అంటే అతనికెందుకంత అభిమానం లాంటివేవీ ఆట్టే చూపకుండానే ఆ పాత్రను కూడా తెర మీద నుంచి హఠాత్తుగా వెనక్కి పంపేశారు.


    ఈ సినిమాలో కథ మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచడానికి, దర్శక, రచయితలు వేసిన హుక్‌... శంకరయ్య అనే పేరు. కోమాలోకి వెళ్ళడానికి ముందు సావిత్రి బెంగుళూరులో షూటింగుకు బయలుదేరుతూ, తన చివరి ఉత్తరంలో ‘బాబు సతీశ్‌ను శంకరయ్య దగ్గరకు తీసుకువస్తాను' అని రాసినట్లు కథా కల్పన చేశారు. ఆ శంకరయ్య ఎవరంటూ జర్నలిస్టుల (సమంత, విజయ్‌ దేవరకొండ) అన్వేషణే కథను ముందుకు నడిపిన ఇంధనం. తీరా సినిమా చివరకు వచ్చేసరికి, ఆ పజిల్‌కు సమాధానం చెప్పకుండానే, ‘ఇక శంకరయ్య ఎవరన్నది తెలిసినా ఒకటే... తెలియకపోయినా ఒకటే' అన్న తనికెళ్ళ భరణి డైలాగుతో ఒక్క ముక్కలో తేల్చేస్తారు. చిన్నప్పటి నుంచి బెజవాడలో చెరువు గట్టున సావిత్రి చూసిన హరికథకుడి విగ్రహం చివరకు సావిత్రి తండ్రి శంకరయ్యదే అన్న భావన కలిగేలా చూపించడం కూడా ఓ పట్టాన సగటు ప్రేక్షకులకు అర్థం కాదు.

     పంటి కింద రాళ్ళు... కంట్లో నలుసులు...

    పంటి కింద రాళ్ళు... కంట్లో నలుసులు...

    వాస్తవాలు, చరిత్ర మాట పక్కన పెడితే, అవేవీ తెలియకపోయినా సాధారణ ప్రేక్షకులకు కూడా పంటికింది రాళ్ళు ‘మహానటి'లో తగులుతాయి. ఉదాహరణకు... సావిత్రి జీవితకథను ఆమె కుమారుడైన చిన్నారి సతీశ్‌కు అమ్మమ్మ (సావిత్రి పెద్దమ్మ పాత్రలో నటి భానుప్రియ) చెప్పడంతో ‘మహానటి'లో ఫ్లాష్‌బ్యాక్‌ మొదలతుంది. కానీ, తీరా ఆ కథ, ఆ నేరేషన్‌ పూర్తయినట్లు మళ్ళీ సినిమాలో ఎక్కడా కనిపించదు. చివరకు భానుప్రియా మళ్ళీ ఎక్కడా ఎదురుకాదు. సావిత్రి పెద నాన్న పాత్ర కూడా అర్ధంతరంగా ఆగిపోతుంది.

    మొదట తనకే తాళి కట్టిన మొగుడైన మనిషిని ఒకరికి నలుగురితో పంచుకోవాల్సిన పరిస్థితిలో పడ్డ జెమినీ గణేశన్‌ మొదటి భార్య అలమేలు పాత్ర (నటి మాళవికా నాయర్‌)... సావిత్రి తరువాత, ఇంకా చెప్పాలంటే సావిత్రి కన్నా ఎక్కువ మానసిక సంఘర్షణ ఉన్న మహిళ పాత్ర. కానీ ఆ పాత్ర అలా మెరిసి ఇలా మాయమైపోవడంతో, ఆ మనోవేదన ఏదీ తెలియదు.

    ‘షావుకారు'లో ‘పాతాళభైరవి'

    సావిత్రి తొలిసారిగా ఎస్వీ రంగారావును చూసింది ‘షావుకారు' (1950 ఏప్రిల్‌ 7న రిలీజ్‌) సినిమా సెట్లో. అది నిజమే. కానీ, ఆ షూటింగ్‌ జరుగుతుంటే సెట్లో... ఎన్టీయార్‌ ‘పాతాళభైరవి' (1951 మార్చి 15న)లో వచ్చే కర్రసాము దృశ్యం తాలూకు గెటప్‌లో కనిపించడం ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా, పామును ఎన్టీయార్‌ పట్టుకున్నట్లు హీరోయిక్‌గా కల్పించిన ఆ సీన్‌లో వెనకాల నుంచి 1977 నాటి ‘దాన వీర శూర కర్ణ' రీరికార్డింగ్‌ మ్యూజిక్‌ వినిపిస్తుంది.

    తెలుగు పాటకు తమిళ సీన్‌

    సినిమాలో సావిత్రి ఫిల్మ్‌ కెరీర్‌ చూపెట్టడం కోసం ఆ పాత సినిమాల్లోని పాపులర్‌ పాటలు వేసుకుంటూ వెళ్ళారు. అక్కడ ‘మిస్సమ్మ'లో ‘రావోయి చందమామా...' అన్న తెలుగు పాటకు సావిత్రి, జెమినీ అభినయించినట్లు చూపెట్టారు. నిజానికి, వాళ్ళిద్దరూ చేసింది తమిళ ‘మిస్సియమ్మ'లో. తెలుగు వెర్షన్‌ ‘మిస్సమ్మ'లో నటించింది సావిత్రి, ఎన్టీయార్‌. తెలుగు పాట వేస్తూ, తమిళ జంటను చూపెట్టడం కనీసం పోస్ట్‌ ప్రొడక్షన్‌లోనైనా సరిదిద్దుకోదగిన లోపం.

    పుల్లయ్య తమిళుడా?

    అలాగే, తమిళ ‘మనంపోల మాంగల్యం' దర్శకుడు తెలుగు వాడైన పి. పుల్లయ్య. ఏడుపుగొట్టు దేవదాసు కథనూ, ఆ కథనూ కంపేర్‌ చేస్తూ, ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ ఫోన్లో మాట్లాడే సీన్‌లో ఆ మాటే చెప్పించారు కూడా. ఆ సినిమా షూటింగ్‌ మొదటిసారి చూపించినప్పుడు తాను తమిళ నిర్మాతో, రచయితో అనిపించేలా తమిళ డైలాగులు చెబుతూ నటుడు మనోబాల కనిపిస్తారు. తీరా తర్వాతిసీనుల్లో తానే దర్శకుడని అనిపించేలా ఆ తమిళ పాత్రే సెట్లో షాట్‌కి కట్‌ చెబుతుంటుంది. వెరసి పి. పుల్లయ్య తమిళుడని అర్థం వచ్చినట్లయింది.

    కెమేరామన్‌ బదులు కెమేరా ఉమన్‌!

    సావిత్రి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు' (1968 జూన్‌ 21). కథ, నిర్మాత, సంగీతం, డ్యాన్స్‌, కళ... ఇలా ఆ సినిమాకు ప్రధానంగా అన్ని విభాగాల్లో మహిళా టెక్నీషియన్లే పనిచేశారు. అయితే, కెమేరామన్‌, ఎడిటర్‌ మాత్రం పురుషులే. (కెమేరా... శేఖర్‌, సింగ్‌ - ఎడిటింగ్‌... ఎం.ఎస్‌.ఎన్‌. మూర్తి). కానీ, ‘మహానటి'లో ‘చిన్నారి పాపలు' ప్రస్తావన వచ్చినప్పుడు, సెట్‌లో మహిళా సినిమాటోగ్రాఫర్‌ను చూపించారు. అలాగే, అప్పట్లో ఏమంత బాగా ఆడని ‘చిన్నారి పాపలు' చిత్రాన్ని ఈ సినిమాలో సూపర్‌ హిట్‌ అని పేర్కొనడం విచిత్రం.

    గుమ్మడి బదులు ఎస్వీఆర్‌!

    గుమ్మడి బదులు ఎస్వీఆర్‌!

    బయోపిక్‌లు తీస్తున్న ప్పుడు కాలక్రమణికలో కానీ, ఏది ముందు, ఏది వెనుక జరిగిందన్నది చూపడంలో కానీ పొరపాట్లొస్తే వాస్తవాలు కూడా అవాస్తవంగా అనిపించే ప్రమాదం ఉంది. అనుకోకుండా ‘మహానటి'లో అలాంటి కంట్లో నలుసులున్నాయి.

    సావిత్రి పాపులారిటీ తగ్గి, చిన్న చిన్న క్యారెక్టర్‌ వేషాలు కూడా చేయడం మొదలు పెట్టాక, సెట్లో ప్రొడక్షన్‌ వాళ్ళు మునుపటిలా గౌర వించక, భోజనం ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయని సందర్భాలున్నాయి. అలాంటి ఓ సందర్భంలో నటుడు గుమ్మడి విషయం గమనించి, మొహమాటపడుతున్న సావిత్రిని బలవంతాన తీసుకొచ్చి, తమతో పాటు షూటింగ్‌లో భోజనం పెట్టిన సంఘటన జగద్విదితం. ఆ వివరమంతా గుమ్మడి తన ఆత్మకథ ‘తీపి గురుతులు-చేదు జ్ఞాపకాలు'లో రాశారు. అయితే, ‘మహానటి'లో మటుకు ఈ సంఘటనను గుమ్మడికి బదులుగా ఎస్వీ రంగారావుకు ఆపాదించారు.

    ఏదో పొరపాటో, సినిమాటిక్‌ లిబర్టీనో అనుకొని సర్దుకుందామనుకున్నా, ఆ సంఘటన కుడి ఎడమగా ‘గోరింటాకు' చిత్రం ప్రాంతంలో జరిగినట్లు చూపించారు. సావిత్రి నటించిన ‘గోరింటాకు' రిలీజైంది 1979 అక్టోబర్‌ 19న. కానీ, అప్పటికి ఎస్వీఆర్‌ మరణించి (1974 జూలై 18) అయిదేళ్ళు దాటిపోయింది.

    ఏది ముందు.. ఏది వెనుక..?

    ఏది ముందు.. ఏది వెనుక..?

    సావిత్రి, జెమినీ తమ పెళ్ళి సంగతి బాహాటంగా ప్రకటించింది... 1956లో. సావిత్రి నటించిన ‘గుండమ్మ కథ' రిలీజైంది... 1962లో. కానీ, సినిమాలో వాళ్ళు తమ పెళ్ళి ప్రకటన చేస్తుంటే, వెనకాల ‘గుండమ్మ కథ' వాల్‌ పోస్టర్‌ కనిపిస్తుంది.

    అలాగే, సావిత్రి ‘షావుకారు' (1950) షూటింగ్‌ జరుగుతున్న సెట్లోకి అడుగుపెడుతుంటే, స్టూడియో ఫ్లోర్‌ బయటేమో ఏకంగా ‘షావుకారు' పోస్టరే స్వాగతం పలుకుతుంటుంది.

    ఇక, ‘మూగమనసులు' హిట్టయి, బాగా ఆడిన తరువాత ‘చివరకు మిగిలేది' సినిమా వచ్చినట్టూ, ఆ చిత్రప్రదర్శన చూసి సావిత్రిని జెమినీ అభినందిస్తూనే, సినిమా ఆడదని చెప్పినట్టూ ఈ ‘మహానటి'లో చూపెట్టారు. కానీ, నిజానికి ‘మూగ మనసులు' (1964) కన్నా నాలుగేళ్ళ ముందే ‘చివరకు మిగిలేది' (1960) రిలీజైపోయిన సంగతి దర్శక, రచయితలు మరిచిపోయినట్టున్నారు.

    చరిత్ర ప్రకారం 1980 మే 10వ తేదీ రాత్రికే... బెంగళూరు హోటల్‌లో తాగి, సావిత్రి కోమాలోకి వెళ్ళిపోయింది. మరి అలాంటప్పుడు ఫోటోగ్రాఫర్‌ కేశవ్‌ (నరేశ్‌)కు ఆ మరునాడు మే 11 డేట్‌తో సావిత్రి ఉత్తరం రాసిందనే సినిమాటిక్‌ కల్పన ఎవరికైనా వాస్తవ విరుద్ధం అనిపిస్తే తప్పు చెప్పలేం.

     జెమినీ గణేషన్‌కు మార్కెట్‌ తగ్గడం నిజమేనా?

    జెమినీ గణేషన్‌కు మార్కెట్‌ తగ్గడం నిజమేనా?

    ఈ సినిమాలో ఉన్న పెద్ద చిక్కల్లా, సావిత్రి వ్యక్తిగత జీవితంలోని ప్రధానమైన సంఘర్షణను చూపడం. ఆ బంధంలోని ఘర్షణలో తప్పెవరిది అన్న విషయానికి వచ్చేసరికి, దర్శకుడు జెమినీ గణేశన్‌ను చాలా వరకు మంచిగానే చూపిస్తూ వచ్చారనిపిస్తుంది. వీలైనంత ఎక్కువ అతనికే బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ ఇచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే, సావిత్రి చివరి సంవత్సరాల్లో ఆమె కుటుంబ సభ్యుల తాలూకు లోపాలూ చూపించలేదు. జెమినీ గణేశన్‌ మొదటి భార్య పిల్లలతో, సావిత్రి సంతానానికి ఇప్పుడున్న ఆర్థిక, హార్దిక సత్సంబంధాలు, బయోపిక్‌కు వారసుల కుటుంబాల నుంచి సినిమా విడుదలకు వివాదాలు రాకుండా చూసుకోవాలనే జాగ్రత్త లాంటివన్నీ ఇందుకు ఇంధనాలైతే కావచ్చు.

    కానీ, నటీశిరోమణిగా ఎదుగుతున్న సావిత్రిని చూసి జెమినీ ఈర్ష్యకు గురయ్యాడనీ, తమిళ సినిమాల్లో మార్కెట్‌ అతనికి తగ్గిపోయిందనీ, అందుకే భరించలేకపోయాడనీ వాస్తవాలకు దూరంగా చూపారు. సినిమాల్లో మార్కెట్‌ సంగతికే వస్తే, వాస్తవం సినిమాలో చూపినదానికి రివర్స్‌. సావిత్రితో గొడవల టైమ్‌కి కూడా జెమినీ బోలెడన్ని సినిమాలతో బిజీ. జెమినీ పెద్ద స్టార్‌గా ఉన్న 1967 నాటికే, సావిత్రికి వైభవం తగ్గి, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు.

    ఇప్పుడు ఆహా అన్నారు...!!

    ఇప్పుడు ఆహా అన్నారు...!!

    ఇక, సావిత్రికి దగ్గరవ్వాలని జెమినీ శతవిధాల ప్రయత్నించాడనడం, సావిత్రి మరణానికి పేదరికమో, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడులో కారణమనిపించేలా చూపడమూ ఏమంత కరెక్ట్‌ కాదు. నిజానికి, మరణానికి ముందు ఇరవై నెలల పైగా కోమాలో ఉన్నప్పుడు కూడా సావిత్రి చికిత్సకు పెట్టిన లక్షల కొద్దీ ఖర్చంతా ఆమె సంపాదనేనని కుటుంబ సభ్యులే తరువాతి రోజుల్లో చెప్పారు. భర్త, సన్నిహితులు చేసిన నమ్మకద్రోహం, ఆర్థిక సంబంధాలే ప్రధానమై కుమార్తె సహా నా అనుకున్నవాళ్ళు దూరంగా ఉండడం, వాటితో తీరని మనోవేదన, మానుకోలేని వ్యసనాలు, ఆహార విహారాల్లో అశ్రద్ధ, రాజీ పడలేని మొండితనం లాంటివన్నీ కలసి సావిత్రి మరణానికి దారి తీశాయి. ‘సావిత్రి అపస్మారకంలో ఉండగా బీరువాలు పగులగొట్టి, లక్షల ఆస్తి దోచుకుపోయారట.

    తాళి కట్టినవాడే ఆమెను మోసగించాడట.' ఇవన్నీ సావిత్రి మరణించిన కొన్నాళ్ళకే సాక్షాత్తూ ఆమె కుమార్తె ‘మా అమ్మ ఆస్తిని దొంగిలించిందెవరు' అంటూ పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించిన విషయాలు. కాగా, తాను అలాంటివాణ్ణి కాదంటూ సావిత్రి చనిపోవడానికి కొద్ది నెలల ముందు కన్నకూతురే తల్లిపై కేసు వేసిందని జెమినీ కూడా అప్పట్లో బాహాటంగా చెప్పారు. ఇవన్నీ ఆనాటి పేపర్లలో వచ్చి, జనంలో గగ్గోలు పుట్టించిన విషయాలు. ఈ కుటుంబ తగాదాల మాటెలా ఉన్నా, వెరసి చివరి రోజుల్లో సావిత్రి అలా ఆ స్థితికి వెళ్ళడానికి ముఖ్య కారకుడంటూ తెలుగు వారి దృష్టిలో జెమినీ గణేశన్‌ విలన్‌గా మిగిలిపోయాడన్నది చరిత్రలోని వాస్తవం.

    కారణాలు ఏమైనా, ఈ బయోపిక్‌ వాటిని వేటినీ చర్చించదు, లోతుగా చూపెట్టదు. పైగా ఆ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసినవారు సైతం ఇప్పుడు అసలు సిసలు చరిత్రకు ఇదే కరెక్ట్‌ సినిమా వెర్షన్‌ అని ఆహా అంటున్నారు. అందుకే, ఇది కేవలం సావిత్రి జీవితాన్ని, అదీ పైపైన స్పృశిస్తూ, ఆమె వ్యక్తిగత జీవితంలోని ఒడుదొడుకుల జోలికి మరీ లోతుగా వెళ్ళకుండా తీసిన ఉపరితల జీవితకథా చిత్రమని గుర్తించాలి. కాకపోతే, సావిత్రిని అన్ని తరాలకూ మరోసారి పరిచయం చేసే మంచి సినిమాటిక్‌ ప్రయత్నంగా, మంచి సాహసంగా గౌరవించాలి. ఆ గౌరవమే మిగిలింది తప్ప, తెలుగుతెరపై ఒక సమకాలీన మహానటిపై వచ్చిన గొప్ప బయోపిక్‌గా చిరస్థాయిగా నిలిచే అవకాశాన్ని ఈ చిత్రం చేజేతులా పోగొట్టుకుంది.

    అవాస్తవ ప్రచారం!

    అవాస్తవ ప్రచారం!

    వెరసి, మోడరన్‌ క్లాసిక్‌, ఆథెంటిక్‌ బయోపిక్‌ లాంటి ప్రశంసలు సినిమా కన్నా సావిత్రి మీద ప్రేమకే ప్రతీకలుగా అనిపిస్తాయి. అయితే, హైదరాబాద్‌ గజారోహణ సమయంలో సావిత్రికి ‘నటీ శిరోమణి' అని బిరుదు ఇస్తే, ‘మహానటి' అని బిరుదు ఇచ్చినట్టూ... అలాగే రక్షణనిధికి గాను ప్రధానమంత్రికి సావిత్రి తన నగలిస్తే, ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఆమే స్వయంగా వెళ్ళి, లాల్‌ బహదూర్‌ శాస్త్రిని కలిసినట్టూ, నగల మూట ఇచ్చి వచ్చినట్టూ... ప్రచారమవుతున్న ఈ వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల యుగంలో ఏది వాస్తవమో, ఎంత వాస్తవమో చెప్పడం కష్టమే. కాబట్టే, బయోపిక్‌లు తీయడం అంత ఈజీ కాదు.


    సినీ ప్రముఖులెవరో అన్నట్లు... ‘వేర్‌ లాజిక్‌ ఎండ్స్‌ దేర్‌ మ్యాజిక్‌ బిగిన్స్‌'. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్ళతో ‘మహానటి' చేస్తున్నది అదే. బయోపిక్‌ కష్టాన్ని ఇష్టంగా తలకెత్తుకొని ఈ అద్భుతానికి కారకులైన మహిళా నిర్మాతలతో సహా దర్శక, నిర్మాణ బృందంలోని అందరికీ వీరతాళ్ళు వెయ్యాల్సిందే! ఈ లోటుపాట్లు కూడా లేకుండా మరింత శ్రద్ధ, జాగ్రత్త, పరిశోధనపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా చిరకాలం చెప్పుకొనే చిరంజీవిగా మిగిలిపోయేది. రాబోయే మరిన్ని బయోపిక్‌లకు నమూనాగా నిలిచిపోయేది. ఆ ఛాన్స్‌ మిస్సయిందన్నదే కించిత్‌ బాధ!

    Courtesy: ఆంధ్రజ్యోతి.కామ్

    English summary
    Nag Ashwin’s Savitri biopic ‘Mahanati’, ‘Nadigaiyar Thilagam’ in Tamil, is going great guns, raking in good business both in India and abroad, apart from receiving rave reviews from both audience and critics alike. Starring Keerthy Suresh, Dulquer Salmaan, Samantha and Vijay Deverakonda in lead roles, the film’s music by Mickey J Meyer was also much appreciated. Now, the filmmakers want to help the film reach more people, especially those who deserve to watch the film and probably couldn’t due to various reasons.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X