మహాత్మ చిత్రంపై కాపీ వివాదం
'మహాత్మ సినిమా వారు నా పాటను దొంగిలించారు. 2005 నుంచి బహుళ జనాదరణ పొందిన నా పాటను ఇష్టారీతిగా వాడుకున్నారు. ఇటీవల విడుదల చేసిన పాటల సీడీలో రచయిత పేరు ముద్రించకుండా పాట వాడు కోవడం వారి చర్యను నిర్ధారిస్తున్నదని ప్రముఖ జానపద గాయకుడు, రచయిత అవుదుర్తి లక్ష్మణ్ తెలిపారు.
శ్రీకాంత్,కృష్ణవంశి కాంబినేషన్లో వస్తున్న ఈ మహాత్మ చిత్రం సెన్సార్ పరంగా ఇప్పటికే చిక్కులను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ కొత్త వివాదం తోడయ్యంది. ఈ సందర్భంగా ఆ రచయిత మీడియాతో మాట్లాడుతూ పాటను ఇష్టారీతిగా వాడుకోవడంపట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. 2005 జనవరిలో 'పల్లె వయ్యారాలు' టైటిల్‌తో ఆడియో పాటల క్యాసెట్ విడుదల చేసినట్లు చెప్పారు. అందులో ఎనిమిది పాటలుండగా నీలంపురి గాజులు చరణం తో రాసిన పాటను మూడో పాటగా రికార్డింగ్ చేసినట్లు క్యాసెట్‌ను చూపించారు.
'నీలంపురి గాజుల' పాటను క్యాసెట్‌లో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ప్రసాద్ గానం చేశారు. ఈ పాటను ప్రముఖ నటుడు శ్రీకాంత్ వందవ చిత్రంగా వస్తున్న 'మహాత్మ' సినిమాలో యదాతథంగా వాడుకున్నట్లు చెప్పారు. కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదల కానున్న ఈ సినిమా పాటల సీడీలను ఇటీవల విడుదల చేశారు. అందులో ఏడో పాటగా నీలపురి పాటను వినియోగించుకున్నట్లు చెప్పారు.
ఈ సీడీలో ఏడు పాటలుండగా ఆరు పాటలకు రచన, గానం మొదలైనవి పేర్కొన్నారు. ఏడో పాటను కాసర్ల శ్యాం అండ్ గ్రూప్ గానం చేసినట్లు సీడీ కవర్ పై ఉంది. రచయిత పేరు పేర్కొనలేదు. తన పాటను అనుమతి లేకుండా వాడుకున్న 'మహాత్మ' సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకులపై కేసు వేయనున్నట్లు తెలిపారు. ఇలా వాడుకోవడం దొంగతనం కిందకే వస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications











