అభిమానులు కూడా నన్ను...మహేష్ బాబు
హైదరాబాద్ : ''నటుడిగా ఎలాంటి సినిమాకైనా, ఎటువంటి పాత్రకైనా అందుబాటులో ఉండాలి అనుకొంటాను. అభిమానులు కూడా నన్ను ప్రతి సినిమాలోనూ ఒకేలా చూడాలనుకోరు. వారికీ వైవిధ్యం కావాలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి సినిమాలతోనే అది సాధ్యమవుతుంది'' అని మహేష్ బాబు తన మనసులో మాట బయటపెట్టారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే మల్టి స్టారర్ చిత్రాలు గురించి మాట్లాడుతూ..మల్టీస్టారర్ కథల్ని ప్రత్యేక దృష్టితో చూడాలి. ఇద్దరు హీరోలు ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడమే... ఆ సినిమా సాధించిన తొలి విజయం.. అని తేల్చి చెప్పారు. వెంకటేశ్, మహేశ్ అన్నదమ్ములుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చివరి షెడ్యూల్ శుక్రవారం నుంచి జరుగుతుంది. గురువారం మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసారు.
ఇక 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్ర విశేషాలను దిల్ రాజు వెల్లడిస్తూ 'ఇదో అద్భుతమైన కథాచిత్రం. దాదాపు 25 ఏళ్ల తరువాత ఇద్దరు ప్రముఖ హీరోలు ఫుల్ లెంగ్త్ రోల్స్ పోషిస్తున్న భారీ మల్టీస్టారర్‌కి నేను నిర్మాతనవడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. వెంకటేశ్, మహేశ్ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, అంజలి హీరోయిన్లు. దర్శకుడు శ్రీకాంత్ చెప్పిన కథ వినగానే మా హీరోలిద్దరూ ఎంతో ఇన్‌స్పైర్ అయి ఈ సినిమా చేయడానికి అంగీకరించారు' అన్నారు.
మహేశ్ గ్రేట్ హీరో అని, ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే ఆయనతో మరో సినిమా చేయడానికి సబ్జెక్ట్ రెడీ చేస్తున్నామంటే ఎంత హ్యాపీగా ఉన్నమో అర్థం చేసుకోమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్ మాట్లాడుతూ 'ఈ నెల 10 నుంచి సినిమా పూర్తయ్యేవరకూ షూటింగ్ జరుగుతుంది. మా షూటింగ్ షెడ్యూల్‌లో మహేశ్ పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉంది' అన్నారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, ఫొటోగ్రఫీ: కె.వి.గుహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.
ధట్స్ తెలుగు ..మహేష్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











