అందరూ అదే పేరుతో పిలుస్తున్నారు: మహేష్ బాబు
నన్ను ఇప్పుడు అందరూ సూర్యాభాయ్ అని పిలుస్తున్నారు అంటూ ఆనందంగా స్పందించారు మహేష్ బాబు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'ఎస్.ఎమ్.ఎస్.' చిత్ర ఆడియో వేడుకలో ఆయన పాల్గొని ఇలా స్పందించారు. మహేష్ మాట్లాడుతూంటే అభిమానులు హర్ష ద్వానాలతో దద్దరిల్లిపోయింది. మహేష్ మాట్లాడుతూ...''దర్శకుడు పూరి జగన్నాథ్ దయ వల్ల నా పేరు సూర్యాభాయ్‌గా మారింది. అందరూ ఇప్పుడు నన్ను అదే పేరుతో పిలుస్తున్నారు. 'బిజినెస్‌మేన్'ని అందరూ బాగా ఆదరిస్తున్నారు. జీవితాంతం వారికి రుణపడి ఉంటా. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఇలానే ఉండాలి'' అన్నారు.
ఇక కృష్ణ మేనల్లుడు సుధీర్ హీరోగా నటించిన చిత్రం 'ఎస్.ఎమ్.ఎస్.'. రెజీనా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. విక్రమ్‌రాజు నిర్మాత. తొలి సీడీని మహేష్‌బాబు ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కి అందించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ ''ఈమధ్య సుధీర్ ఓ సీడీ చూపించాడు. అందులో తాను సొంతంగా రూపొందించుకొన్న నృత్యాలు, పోరాట దృశ్యాలున్నాయి. 'ఇది వరకు నీకు ఇవన్నీ తెలుసా?' అని అడిగాను. 'లేదు.. ఆరు నెలల కిందటే నేర్చుకొన్నా' అన్నాడు. ఇంత స్వల్ప వ్యవధిలో ఇవన్నీ నేర్చుకొన్నాడంటే మాటలు కాదు. సుధీర్ చాలా కష్టపడ్డాడు. అందుకు తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంద''ని అన్నారు.
కృష్ణ చెబుతూ ''మా కుటుంబం నుంచి మరో కథానాయకుడు రావడం ఆనందంగా ఉంది. తమిళంలో ఈ సినిమా బాగా ఆడింది. తెలుగులోనూ అదే ఫలితం రావాలి. ప్రచార చిత్రాలు, సెల్వ గణేషన్ అందించిన బాణీలు బాగున్నాయ''న్నారు. ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు, విజయనిర్మల, సుకుమార్, రమేష్ ప్రసాద్, గోపీ ఆచంట, రామ్ ఆచంట, ఎన్వీ ప్రసాద్, పుల్లెల గోపీచంద్, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











