Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మకు 32 రకాల వంటలు.. అన్ని కోట్లు ఖర్చు చేశారా?
దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో నవంబర్ 15న ఉదయం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంతిమయాత్రను అశేష అభిమానుల మధ్య నిర్వహించి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఇక ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మను మహేశ్ బాబు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలతోపాటు భారీ ఎత్తున అభిమానులు సైతం హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఈ పెద్దకర్మకు అయిన ఖర్చు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరణించిన 13వ రోజు..
నటుడు, దర్శకుడు, నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ లోకాన్ని కలిచివేసింది. కృష్మ మరణంతో మహేశ్ బాబు కుటుంబం తీవ్ర శోకసంద్రంలోకి వెళ్లింది. అలాగే అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నవంబర్ 16న అశేష అభిమానుల మధ్య జరిగిన అంతిమయాత్ర అనంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక నవంబర్ 27న (ఆదివారం) అంటే సూపర్ స్టార్ కృష్ణ మరణించిన 13వ రోజు పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి వద్ద శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

అభిమానులకు పాస్ సిస్టమ్..
ఇంటి వద్ద పూజల అనంతరం అతిథులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ పెద్దకర్మకు వచ్చే అతిథుల కోసం మహేశ్ బాబు రెండు వేదికలను ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేయగా.. అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ లో విందు ఇచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారన్న ఉద్దేశంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా పాస్ సిస్టమ్ పెట్టారు. అలా అభిమానులందరికీ పాస్ లు అందజేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే వారికోసం 32 వంటకాలు తయారు చేశారట.
ప్రముఖ రెస్టారెంట్ నుంచి..
జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన విందుకు సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది అభిమానులు హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరందరికోసం మొత్తంగా 32 రకాల వంటకాలు తయారు చేశారని టాక్ వినిపించింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. మహేశ్ బాబు మంచి మనసు చాటుకున్నాడు అంటూ అభిమానులు ట్విటర్ వేదికగా పోస్టులు కూడా పెట్టారు. సినీ సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన విందుకు జూబ్లీహిల్స్ లోని ప్రముఖ రెస్టారెంట్ నుంచి భోజనం రెడీ చేయించారట. ఇందులో పలు రకాల నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయని తెలుస్తోంది.

పెద్దకర్మకు అన్ని కోట్లు ఖర్చు..
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమంలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, సుధీర్ బాబు, ఆదిశేషగిరి రావు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) హాజరైన విషయం తెలిసిందే. మొత్తంగా సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మకు రూ. 2 కోట్లు ఖర్చు చేశారని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణ పెద్దకర్మకు మహేశ్ బాబు రూ. 2 కోట్లు ఖర్చు చేశారన్న వార్తలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో తన తండ్రి గురించి మాట్లాడుతూ మహేశ్ బాబు ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











