పెళ్లి చేసేసుకున్నా కదా ....: మహేష్ బాబు
హైదరాబాద్: 'పెళ్లయిందిగా.. ఇంట్లోనే ఉంటున్నా.. అమ్మాయిల కంట పడే అవకాశం లేదు' అని చిలిపిగా బదులిచ్చారు మహేష్‌బాబు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ మీడియాతో మాట్లాడారు. 'చూసిన రెండు నిమిషాలకు ప్రతీదీ పడిపోతోంది.. ఈ మధ్య నా టైమేంటో నాకే అర్థం కావడం లేదు..' ఇదీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో చిన్నోడు (మహేష్‌బాబు) పలికే డైలాగ్! మరి నిజ జీవితంలోనూ ఇంతేనా అంటే ఇలా బదులిచ్చారు.
అలాగే మంచి సినిమా విజయవంతం అయితే ఎంతో ఉత్తేజం కలుగుతుందని, 'సీతమ్మ వాకిట్లో..' ఘన విజయం కావడం తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని తెలిపారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా విజయవంత మైనందుకు చాలా సంతోషంగా ఉంది. కుటుంబసమేతంగా చూడదగ్గ ఒక మంచి సినిమాను ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. ఈ సంక్రాంతికి ఆనందోత్సాహాలను మిగిల్చింది. ఈ చిత్రంలోలా... నిజ జీవితంలో అమ్మాయిలు నా వెంటపడకపోవచ్చు. పెళ్లి చేసేసుకున్నా కదా (నవ్వుతూ). వెంకటేష్‌తో కలసి నటించడం ఓ గొప్ప అనుభవం. ఆయన ఓ మంచి నటుడు. మరోసారి మల్టీస్టారర్‌లో నటించే ఆలోచన ప్రస్తుతానికి లేదు.
ఇక యువతకు సందేశాన్నిచ్చేంత వయసు నాకు లేదు. 'బిజినెస్‌మేన్' శుభం కార్డ్‌కి ముందు నేనిచ్చిన సందేశాన్ని నిజజీవితంలో కూడా ఇస్తే తంతారు . తన తరవాత సినిమా సుకుమార్ దర్శకత్వంలో రానుందని, ఇంకా పేరు నిర్ణయించలేదన్నారు. ''మంచి తెలుగు చిత్రాలు చేయడంపైనే నా దృష్టంతా నిలుపుతున్నా. బాలీవుడ్ అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. భవిష్యత్తులోనూ హిందీకి వెళ్లేది లేద''ని మహేష్ తేల్చిచెప్పారు. యువతకు సందేశం ఇచ్చేంత పెద్దవాడిని కాలేదని ఒక ప్రశ్నకు నవ్వుతూ బదులిచ్చారు.
ఐడియా సెల్యులార్ కంపెనీ 3జీ శ్రేణిలో ఆవిష్కరించిన ఐవరీ ఫోన్‌ను సంస్థ ప్రచారకర్త గా మహేశ్‌బాబు ఎంపికకావటంపై మాట్లాడుతూ... పలు సంస్థలకు ప్రచారకర్తగా ఎంపికవ్వడం తనకు సంతోషం కలిగించే అంశమేనని, ఆయా బ్రాండ్‌లపై నమ్మకం కుదిరితేనే ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ''నేను తరచూ సెల్‌ఫోన్లు మార్చను. ప్రస్తుతం ఐఫోన్ వినియోగిస్తు న్నాను''అన్నారు.


Click it and Unblock the Notifications











