ఉపశమనం కోసం సింగపూర్ వెళ్లిన మహేష్ బాబు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. పగతి పూట బయటికి వెళ్లాలంటే నరకమే. సినిమా షూటింగులకు కూడా ఎండల మూలంగా ఇబ్బంది తప్పడం లేదు. దీంతో ఔట్ డోర్ షూటింగులు వాయిదా వేసుకుని ఇండోర్ షూటింగులు జరుపుతున్నారు. కొందరు స్టార్స్ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు విదేశాలకు వెళ్లారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సూర్య తాపం నుంచి ఉపశమనం పొందడానికి తన భార్య నమ్రత, ఇద్దరు పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు సింగపూర్ వెళ్లారు. ఎండలు తగ్గే వరకు అక్కడే గడుపుతారని తెలుస్తోంది. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో పాల్గొననున్నాడు. ఆతర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందబోయే 'ఆగడు' షూటింగులో జాయిన్ కానున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో పాటు, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందబోయే 'ఆగడు' చిత్రాన్ని కూడా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో క్రితి సానన్ హీరోయిన్. అయితే ఆగడు చిత్రానికి ఇంకా హీరోయిన్ ఎవరనేది నిర్ణయించలేదని దర్శకుడు శ్రీను వైట్ల స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications












