'మా'కు సంబంధం లేదు, మహేష్ బాబే సొంతంగా.. ఊహించని షాక్‌కు కారణం అదేనా!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అమెరికాలో మహర్షి చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మా అసోసియేషన్ వారు మహేష్ ముఖ్య అతిధిగా నిర్వహించాలనుకున్నా ఓ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. ఈవెంట్ రద్దు కావడానికి అనేక కారణాలు వినిపించాయి. ఎలాగూ మహేష్ అమెరికాలోనే ఉండడంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మా అసోసియేషన్ వారు భావించారు. మహేష్ ముఖ్య అతిధిగా ఈవెంట్ నిర్వహించి వచ్చిన నిధుల్ని మా అసోసియేషన్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగించుకోవాలనేది ప్లాన్.

ఆసక్తి చూపలేదు
ఈ ఈవెంట్ కు మొదట 2 వేల డాలర్ల వరకు టికెట్ ధర నిర్వహించారు. ఆశించిన స్పందన రాకపోవడంతో 400 డాలర్లకు తగ్గించారు. అయినా కూడా ఈ ఈవెంట్ కు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ కారణం వల్లనే కార్యక్రమాన్ని రద్దు చేసారని నిన్న వార్తలు వచ్చాయి.

అసలు కారణం ఇదే
తాజాగా నిర్వాహకులు ఈ ఈవెంట్ రద్దు కావడానికి గల కారణాలు వివరించారు. కార్యక్రమానికి ఎంపిక చేసుకున్న వేదిక సరిగా లేకపోవడం, మహేష్ బాబుకు సెక్యూరిటీ వంటి సమస్యల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నిర్వాహకులు మీడియాకు తెలిపారు.

మహేష్ బాబు సొంతంగా
మరోవైపు సీనియర్ హీరో శ్రీకాంత్ మహేష్ ఈవెంట్ పై భిన్నంగా స్పందించినట్లు ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఈ ఈవెంట్ ని మహేష్ బాబే చారిటి నిర్వహించేందుకు నిధుల కోసం ప్లాన్ చేసుకున్నారని తెలిపాడు. మా అసోసియేషన్ కు ఈ ఈవెంట్ కు ఎలాంటి సంభందం లేదని శ్రీకాంత్ తెలిపాడు.

వేసవిలో మహర్షి
ఇదిలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ ఏడాది వేసవిలో మహేష్ భరత్ అనే నేను చిత్రంతో అభిమానులని అలరించిన సంగతి తెలిసిందే. ప్రతిభ గల దర్శకుడు వంశీ పైడిపల్లి మహర్షి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందాల తార పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్.


Click it and Unblock the Notifications











