రియల్ సూపర్ స్టార్: ఆ చిన్నారి జీవితంలో వెలుగు నింపిన మహేష్ బాబు!
కొందరు నటులు తెరపై మాత్రమే హీరోలుగా కనిపిస్తారు, కానీ కొందరు తెరపై మాత్రమే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి మహేష్ బాబు పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలిచిన మహేష్ బాబు తాజాగా ఓ చిన్నా జీవితంలో వెలుగు నింపారు.

క్యాన్సర్ చిన్నారికి మహేష్ బాబు సహాయం
క్యాన్సర్‌తో బాధపడుతున్న తనీష్ అనే చిన్నారి వైద్య చికిత్సకు మహేష్ బాబు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా తనీష్ కుటుంబ సభ్యులు మహేష్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకున్న చిన్నారితో ఫొటో దిగి కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సేవా కార్యక్రమాల్లో మహేష్ బాబు
మహేష్ బాబు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. 'హీల్-ఎ-చైల్డ్' అనే స్వచ్చంద సంస్థకు గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయడంతో పాటు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ సంస్థ చిన్నారుల క్షేమం కోసం పని చేస్తుంది.

నిజమైన శ్రీమంతుడు
‘శ్రీమంతుడు' సినిమా ద్వారా సొంత ఊరి అభివృద్ధికి పాటు పడాలని సందేశం ఇచ్చిన మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

సినిమాల్లో మహేష్ బాబు బిజీ
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ‘భరత్ అనే నేను' చిత్రంలో నటిస్తున్నారు. కైరా అడ్వాణీ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications