సుకుమార్‌తో సినిమా రద్దు, మహేష్ ప్రకటన.. బన్నీ చిత్రానికి ఆల్ ది బెస్ట్, అసలేం జరిగిందంటే!
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. రైతు సమస్యల నేపథ్యంలో వంశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ అధినేతగా, రైతు సమస్యలని మోడ్రన్ పద్దతులలో పరిష్కరించే వ్యక్తిగా నటిస్తున్నాడు. మహర్షిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మహర్షి చిత్రం తర్వాత మహేష్ సుకుమార్ దర్శత్వంలో నటించాల్సిఉంది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కాస్త ఆలస్యమైనా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో మహేష్ బాబు చేదు వార్తని ప్రకటించాడు.

రంగస్థలం తర్వాత
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత మహేష్ తో ప్రాజెక్ట్ కోసం ప్రకటన వచ్చింది. మైత్రి మూవీస్ నిర్మణంలో సుకుమార్, మహెష్ కాంబినేషన్ లో చిత్రం ఉంటుందని ప్రకటించారు. అప్పటినుంచి సుకుమార్ మహేష్ సినిమాకు సంబంధించిన కథని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. కథ డెవలప్ మెంట్ లో కొన్ని అంశాల పట్ల మహేష్ అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు వచ్చాయి.

ఆలస్యం
ఓ వైపు మహర్షి చిత్రం పూర్తి కావస్తున్నా సుకుమార్ వినిపిస్తున్న కథలు మహేష్ కు సంతృప్తినివ్వడం లేదు. దీనితో వీరి చిత్రం మరింత ఆలస్యం అవుతుందని అంతా భావించారు. మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో ఆల్రెడీ 1 నేనొక్కడినే చిత్రం వచ్చింది. ఆ చిత్రం నిరాశపరచడంతో మహేష్ ఈ ప్రాజెక్ట్ పై ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
చేదు వార్తని స్వయంగా
కొంత కాలం ఆలస్యం అయినా ఈ కాంబినేషన్ లో చిత్రం పట్టాలెక్కుతోంది భావిస్తున్న అభిమానులకు మహేష్ బాబు స్వయంగా చేదు వార్తని ప్రకటించాడు. సుకుమార్ తో తన చిత్రం రద్దయినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన సుకుమార్ తో నా చిత్రం రద్దయింది. సుకుమార్ కొత్త చిత్రానికి నా శుభాకాంక్షలు. ప్రతి దర్శకుడి పట్ల నాకు గౌరవం ఉంటుంది అని మహేష్ బాబు ట్విట్టర్లో పేర్కొన్నాడు.

బన్నీతో కొత్త సినిమా
ఇదిలా ఉండగా శివరాత్రి పర్వదినం సంధర్భంగా సుకుమార్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. మైత్రి మూవీస్ నిర్మాణంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆర్య 2 తర్వాత సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఇదే. బన్నీ చిత్రానికి మహేష్ బాబు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఇక సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన 1 నేనొక్కడినే చిత్రాన్ని కూడా మహేష్ గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రం తన కెరీర్ లో ఓ క్లాసిక్ గా ఉండిపోతుందని తెలిపాడు.


Click it and Unblock the Notifications











