మరోసారి ‘దూకుడు’కాంబినేషన్ ..డిటేల్స్
హైదరాబాద్ : నేను చేయబోయే తదుపరి చిత్రం మహేష్‌బాబుతో ఉంటుంది. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేశాం. దూకుడు నిర్మాతలతోనే ఈ చిత్రం ఉంటుంది అన్నారు శ్రీను వైట్ల. అంటే 'దూకుడు' కాంబినేషన్ త్వరలోనే రిపీట్ కాబోతోందన్నమాట. గత ఏడాది సెప్టెంబర్ 23న 'దూకుడు' విడుదలైంది. అంటే నిన్నటికి(ఆదివారం) ఆ సినిమా వచ్చి ఏడాది పూర్తయింది. వరస ప్లాపుల్లో ఉన్న మహేష్‌బాబు హిట్టిచ్చి స్టార్‌డమ్‌ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సినిమా ఇది. దర్శకునిగా శ్రీనువైట్లకు కూడా ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది.
అలాగే ఆ తాజా చిత్రానికీ 'దూకుడు' నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలే నిర్మాతలు కావటం కూడా అభిమానులకు ఆనందపరిచే విషయం. వచ్చే ఏడాది ఈ భారీ చిత్రం మొదలుకానుందని నిర్మాతలు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. శ్రీనువైట్ల అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారని, ఎన్టీఆర్‌తో ఆయన చేస్తున్న 'బాద్‌షా' చిత్రం పూర్తవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని ఈ సందర్భంగా వారు చెప్పారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఇదే సంస్థలో మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం వీరు ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
సినిమా ఎలా ఉండబోతుంది అనేదానికి శ్రీను వైట్ల సమాధానమిస్తూ .....స్వతహాగా నాకు ఫైట్స్ , హీరోయిజంతో కూడిన మాస్ అంశాలంటే చాలా ఇష్టం. ఆ తరహా సినిమాల్ని ఎక్కువగా చూశాను. అలాగే జంధ్యాల, వంశీ, ఇ.వి.వి.సత్యనారాయణ లాంటి దర్శకుల సినిమాల్లో వినోదం అంటే కూడా చాలా చాలా ఇష్టం. నా మాట తీరులోనూ, ఆలోచనా విధానంలోనూ హాస్యం తొంగి చూస్తుంటుందని స్నేహితులు చెబుతుండేవారు. ఇవన్నీ ఓ కథలో మిళితం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 'వెంకీ' చేశాను. అప్పట్నుంచి నాకు ఆ సూత్రం అలవాటైంది అన్నారు.
'ఢీ', 'రెడీ'.. ఇలా ప్రతి సినిమాకీ నేపథ్యం భిన్నంగా ఉన్నా... అందులో యాక్షన్, వినోదం, భావోద్వేగాలు మేళవించడం మాత్రం మరిచిపోలేదు. మరో ప్రక్క 'దూకుడు' చిత్రాన్ని హిందీలోకి తీసుకెళ్తటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయమై శ్రీను వైట్ల మాట్లాడుతూ....ఆ సినిమా హక్కులు హిందీలో చాలా మంది అడుగుతున్నారు. కానీ అక్కడ కూడా మేమే నిర్మించాలనే ఉద్దేశంతో హక్కుల్ని ఎవరికీ ఇవ్వలేదు. బహుశా... వచ్చే యేడాది హిందీ 'దూకుడు' ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











