ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నమహేష్ -సుకుమార్ కాంబినేషన్
మహేష్, శ్రీను వైట్ల తొలి కాంబినేషన్‌లో వస్తున్న 'దూకుడు' సినిమాపై అంచనాలు అంబరాన్నటుండగా, మరో డైరెక్టర్‌తో మహేష్ తొలి కాంబినేషన్ సినిమా విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ఆ కాంబినేషన్ సుకుమార్ తో. పూరి జగన్నాథ్ తో చేస్తున్న 'బిజినెస్‌మేన్' తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో చేయడానికి మహేష్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రచారంలో ఉన్న నిజాన్ని సుకుమార్ ధృవీకరించాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుని అతను సిద్ధం చేశాడు. 'బిజినెస్‌మేన్' 2012 జనవరిలో విడుదల కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా 'దూకుడు' నిర్మాతలే తీయనున్నారనేది సమాచారం. సుకుమార్ కి అత్యంత ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి పనిచేసే అవకాశాలున్నాయి.సుకుమార్ విషయానికి వస్తే సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఓ హీరోతో పనిచేయడం అతడికి ఇదే తొలిసారవుతుంది.
ఇదివరకు అతను అల్లు అర్జున్, రామ్, నాగచైతన్యలను డైరెక్ట్ చేశాడు. ఆ ముగ్గురిలో స్టార్ ఇమేజ్ ఉన్నది అర్జున్ కే. 'ఆర్య'తో అతడికి ఆ ఇమేజ్ తెచ్చింది సుకుమార్ అనేది గమనార్హం. ఇప్పుడు మహేష్ ని అతడు డైరెక్ట్ చేసే సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అతడి స్క్రిప్టుల్లో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మేధావితనం కూడా ఉంటుందనేది నిజం. అంటే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే తీరులో అతడు హీరో పాత్రని మలుస్తుంటాడు. మరి మహేష్ ని అతడు ఎలా చూపిస్తాడు? మహేష్ లోని నటుణ్ణి ఎలా ఉపయోగించుకుంటాడు? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications











