మహేశ్ బాబు ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. ఎన్టీఆర్‌పై పోటీ చేసిన నిర్మాత కన్నుమూత
ఇండియా వ్యాప్తంగా సినీ రంగం అనేది చాలా విస్తృతంగా ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇటీవలే ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరి మరణం నుంచి తేరుకునే లోపే మరొకరు కన్నుమూస్తున్నారు. ఇలా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా చాలా భాషల్లో ఎన్నో చిత్రాలను నిర్మించిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (74) మరణించారు.
సూపర్ స్టార్ కృష్ణ బావ, మహేశ్ బాబు మామయ్య, ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలిసింది. అయితే, ఆయనకు వైద్యులు చికిత్స అందించడంతో కోలుకుని ఇప్పుడు బాగానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబుకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న సమయంలోనే అంటే ఆదివారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు ఆయనను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఈ సీనియర్ ప్రొడ్యూసర్ ఆస్పత్రిలోనే తుది శ్వాసను విడిచారు. ఈ విషయాన్ని నిర్మాతల మండలి సభ్యులు తెలిపారు. ఇక, ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీతులసిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా మారి పద్మావతీ ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించారు. ఇందులో ఆయన తెలుగు, కన్నడం, హిందీ భాషలను కలుపుకుని దాదాపు 25 వరకూ సినిమాలను నిర్మించారు. 'శంఖారావం', 'బజార్ రౌడీ', 'అల్లుడు దిద్దిన కాపురం', 'అన్నదమ్ముల సవాల్' వంటి చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇలా చాలా కాలం పాటు ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు నిర్మాతగా వ్యవహరించి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
సినిమా నిర్మాతగా సక్సెస్ అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆయన 1985లో నందమూరి తారక రామారావుపై గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ, ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత పాలిటిక్స్ నుంచి కూడా దాదాపుగా తప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











