త్వరలో మహేష్ బాబుతో సినిమా: వివి వినాయక్ ప్రకటన
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు. ఆయన ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. సొంత పనుల నిమిత్తం విశాఖ జిల్లా నక్కపల్లి వచ్చిన ఆయన మాట్లాడుతూ...వచ్చే ఏడాది మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు తెలిపారు.
మరో ఇద్దరు పెద్ద హీరోలతో రెండు సినిమాలు ఉన్నాయని, వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని వినాయక్ తెలిపారు. చిరంజీవి 150వ సినిమాకు ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, దర్శకుడు ఎవరో చిరంజీవిగారే స్వయంగా నిర్ణయిస్తారని వినాయక్ చెప్పుకొచ్చారు. అదే విధంగా ఎన్టీఆర్ తో అదుర్స్-2 చేయడానికి మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

కాగా...వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ‘అల్లుడు శ్రీను' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ నేపథ్యంలో వివి వినాయక్ దర్శకత్వంలో తన తనయుడు అఖిల్‌ను హీరోగా పరిచయం చేయాలనే యోచనలో నాగార్జున ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మీడియా సమావేశంలో వివి వినాయక్ అలాంటి ప్రస్తావన ఏమీ తేలేదు. దీన్ని బట్టి వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తెరంగ్రేటం అనే వార్తలు కేవలం కల్పితాలే అని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











