కొడుకుతో గోవాలో మహేష్....వేర్వేరుగానే!
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా సినిమా '1-నేనొక్కడినే' షూటింగులో భాగంగా ప్రస్తుతం గోవాలో గడుపుతున్నారు. మహేష్ తనయుడు గౌతం కూడా షూటింగులో పాల్గొంటున్నాడు. అలా అని ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపిస్తారనుకుంటే పొరపాటే. ఇద్దరిపై వేర్వేరుగా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో కూడా వేర్వేరుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో గౌతం నటిస్తున్నాడు. గోవా షెడ్యూల్‌తో షూటింగు పూర్తవుతుంది.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం 14 రీల్స్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మహేష్‌కి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.
వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్ హెయిన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications












