డబుల్ డ్యూటీ చేస్తూ కష్ట పడుతున్న మహేష్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న టైటిల్ ఖరారు కాని సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగులో అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇక్కడ మహేష్ బాబు, కాజల్ లపై సాంగు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల మహేష్ బాబుకు చిన్నపాటి అస్వస్థత ఏర్పడటంతో షూటింగ్ వాయిదా వేయడంతో చిత్రీకరణ కాస్త లేటవుతోంది.
మహేష్ బాబు మరో వైపు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. మే 7వ తేదీ నుంచి మహేష్ బాబు మళ్లీ తిరిగి ఈ చిత్రం షూటింగులో జాయిన్ కాబోతున్నాడు. మహేష్ ఈ విధంగా ఒకే సమయంలో రెండు సినిమాలు వరుస పెట్టి చేయడం చాలా అరుదు. ఇదంతా ఖలేజా ప్లాప్ ఎఫెక్టే అంటున్నారు. దూకుడు, బిజినెస్ మేన్ చిత్రాల ద్వారా వచ్చిన టాప్ పొజిషన్‌ను అలాగే కాపాడుకునేందుకే మహేష్ బాబు ఇలా డబుల్ డ్యూటీ చేస్తూ కష్ట పడుతున్నారని చర్చించుకుంటున్నారు.
తన గత చిత్రాలకు భిన్నంగా మహేష్ బాబు... విక్టరీ వెంకటేష్ లాంటి సినీయర్ హీరోతో కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం కావడంతో ఇటు అభిమానుల్లో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రం హిట్టయితే బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ లోనూ బడాహీరోల మల్టీస్టారక్ మూవీల జోరు పెరగనుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మహేష్ సరసన సమంత, వెంకీ సరసన అంజలి నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, సినిమాటోగ్రఫీ: కెవి. గుహన్, నిర్మాత: దిల్ రాజు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











