పాఠశాల విద్యార్థులకు ‘మేజర్’ బంపర్ ఆఫర్.. అలా చేస్తే సగం రేటుకే సినిమా స్పెషల్ షో!
అడివి శేష్ హీరోగా వచ్చిన మేజర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. సినిమా విడుదల కాకముందే సుమారు 10 నగరాలలో ప్రీమియర్ షో ద్వారా అనేక మందికి సినిమా చూపించి తమ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు మేకర్స్. అలా అనేక అంచనాలతో ఈ సినిమా జూన్ 3న విడుదలైయింది. అలా మేజర్ సినిమా రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని, భారీ విజయం సాధించి, అద్భుతమైన కలెక్షన్లు కూడా సాధిస్తుంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా సినిమాను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు. దీంతో మేజర్ సినిమాపై ప్రేక్షకులు, సెలబ్రిటీలు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఈ సినిమాను మరింత మందికి చేరువయ్యేలా చేసేందుకు మేజర్ సినిమా యూనిట్ పాఠశాల విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి పాఠశాల విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తోంది. పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక షో కోసం [email protected] కి మెయిల్ చేస్తే మేజర్ టీమ్ ఆ స్కూల్ విద్యార్థులకు స్పెషల్ షో ఏర్పాటు చేస్తామని అడివి శేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా హీరో అడవి శేష్ ఓ స్పెషల్ వీడియో విడుదల చేసి వెల్లడించారు.

ఈ వీడియోలో అడివి శేష్ మాట్లాడుతూ.. మేజర్ సినిమాకి ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికి ధన్యవాదాలు, కొన్ని రోజులుగా చాలా మంది చిన్నారులు నాకు ఫోన్ చేసి, సోషల్ మీడియాలో మెసేజ్ లు చేసి సినిమా గురించి మాట్లాడుతున్నారని, వాళ్లందరికీ కూడా మేజర్ సినిమా బాగా నచ్చిందని అన్నారు. వాళ్లు మేమూ మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతమని చెప్పడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ సినిమా పిల్లలకు కూడా ఇంత బాగా నచ్చుతుందని మేము అనుకోలేదన్న ఆయన, ఈ స్పందన చూసి మేం ఓ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మరింతమంది విద్యార్థులు మేజర్ గురించి తెలుసుకుని స్ఫూర్తిపొందాలని, గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నామని, రేపటి తరానికి మేజర్ సందీప్ గురించి తెలియాలనేదే మా లక్ష్యం అని అన్నారు. ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా, జిఎంబి ఎంటర్టైన్మెంట్ సహా ఏప్లస్ఎస్ మూవీస్ వారు నిర్మించగా, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











