'దిల్' రాజుకి తొలినష్టం
వరుస విజయాలతో హ్యాట్రిక్స్ మీద హ్యాట్రిక్స్ కొడుతూ తెలుగు సినీ పరిశ్రమలో గోల్డెన్ హ్యాండ్ గా పిలవబడుతున్న నిర్మాత 'దిల్' రాజు. సినిమా నిర్మాణంలోనే కాకుండా సినిమా పంపినీల్లో కూడా రాజుది లక్కీ హ్యాండే. ఆయన పంపినీ చేసిన 'పోకిరి', 'హ్యాపీ డేస్', 'అందాల రాముడు' లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
అంతటి విజయాలున్న రాజన్నకి 'మల్లన్న' చిత్రం నష్టం మిగులుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య పోయిన వారం విడుదలైన 'మల్లన్న' చిత్రాన్ని నైజాం ఏరియాలో 'దిల్' రాజు పంపినీ చేసారు. తొలి నాలుగు రోజుల్లో 2.08 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి 2.5 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలు వున్నాయి. మొత్తం మీద ఈ చిత్రం నైజాం ఏరియాలో5.5 కోట్లకు మించి వసూలు చెయ్యలేదని, ఇలా అయితే 'దిల్' రాజుకి కచ్చితంగా నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు.
దీంతో 'దిల్' రాజు తన తర్వాతి చిత్రం 'జోష్' పైన భారీగా ఆశలు పెట్టుకున్నారని సమాచారం. నాగచైతన్య కథానాయకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చినా తర్వాతి వసూల్లు సినిమా విజయంపై ఆధారపడి వుంటాయి. ఈ సినిమాతో తిరిగి 'దిల్' రాజు లాభాల బాటపట్టాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











