RRR : థియేటర్ వద్ద కలకలం.. గన్‌తో యువకుడి హల్‌చల్...రంగంలోకి దిగిన పోలీసులకు షాక్!
2018 సంవత్సరంలో రాజమౌళి నందమూరి తారక రామారావు, రామ్ చరణ్ తేజ ఇద్దరినీ హీరోలుగా పెట్టి ఒక సినిమా చేస్తున్నానని ప్రకటించారు. ఆ తరువాత దానికి RRR అని నామకరణం చేశారు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రకటించిన నాలుగేళ్ల తర్వాత RRR సినిమా ఎట్టకేలకు మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. విడుదలైన మొదటి ఆట నుంచి ఈ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా ఆడుతున్న ఒక థియేటర్ లో ఒక వ్యక్తి గన్ తో హల్చల్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆనందంలో
కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశ విదేశాల్లో కూడా ప్రస్తుతం RRR మానియా నెలకొంది.. ఎవరిని కదిలించినా రాజమౌళి గురించి, రామ్ చరణ్ గురించి, ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక ఒక పక్క మెగా ఫ్యాన్స్ మరోపక్క నందమూరి ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ థియేటర్ల ముందు పడిగాపులు కాస్తూ టిక్కెట్లు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూనే మరో వైపు తమ అభిమాన హీరోల సినిమా అద్భుతం అంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

కల్పిత కథతో
ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు. చరిత్రలో అసలు కలిసారో లేదో తెలియని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు గనుక కలిస్తే ఎలా ఉంటుంది అని ఒక కల్పిత కథ తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు.

గన్ తో హల్ చల్
సినిమా నిడివి మూడు గంటలు ఉన్నా ప్రేక్షకులు ఏ మాత్రం విసుగు చెందకుండా సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే తూర్పు గోదావరి జిల్లా లోని పిఠాపురం పట్టణంలో ఈ సినిమా ప్రదర్శితం అవుతున్న అన్నపూర్ణ థియేటర్ వద్ద ఒక వ్యక్తి గన్ తో హల్ చల్ చేశాడు.

ఫోటోలకు ఫోజులు
అయితే అతని చేతిలో ఉన్న తుపాకీ నిజమైనదా? లేక డమ్మీదా అనే విషయం అర్థం కాక పోవడంతో సినిమా చూడడానికి వచ్చిన మిగతా ప్రేక్షకులు అందరిలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. సినిమా ప్రారంభం కావడానికి ముందు గన్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సదరు యువకుడు సినిమా ప్రారంభమైన తర్వాత తెర ముందుకు వెళ్లి గన్ తో కేరింతలు కొట్టడం సంచలనంగా మారింది.

డమ్మీ తుపాకీ
సినిమా ముగిసిన తర్వాత కూడా అలాగే గన్ తో విన్యాసాలు చేస్తూ ఉండడంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సదరు వ్యక్తి దగ్గరకు వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. విచారణలో సదరు వ్యక్తి దగ్గర ఉన్న తుపాకీ డమ్మీ తుపాకీ అని దాని వల్ల ఎలాంటి హాని జరగదు అని తేల్చారు., అయినా సరే ముందస్తు జాగ్రత్త చర్యగా అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్ కి తరలించారు.


Click it and Unblock the Notifications











