'ఊకొడతారా.. ఉలిక్కి పడతారా' కథకు నేపథ్యమేమిటి?
హైదరాబాద్: గంధర్వ మహల్ అనే రాజసౌధం చుట్టూ సాగే కథ ఇది. సినిమా పరిభాషలో... డార్క్ కామెడీ చిత్రం అంటారు. "ఇప్పటిదాకా మన దేశంలో ఎవరూ ఇలాంటి సినిమాని తీయలేదు. తొలిసారి తెలుగులో మేం తీసినందుకు గర్వంగా ఉంది. యాక్షన్, కామెడీ, కుటుంబ అనుబంధాలతోపాటు... థ్రిల్లర్ అంశాలు కూడా ఇందులో ఉంటాయి. మంచు మనోజ్ కలల చిత్రం 'ఊకొడతారా.. ఉలిక్కి పడతారా'. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తుంది" అంటూ మీడియాతో మనోజ్ చెప్పుకొచ్చారు.
అలాగే ఈ చిత్రంలో తాను రకరకాల గెటప్పులతో కనిపిస్తున్నానంటూ మంచు మనోజ్ చెప్తూ... "తెరపై భిన్నమైన గెటప్పుల్లో కనిపించాలనే కోరిక ప్రతి నటుడికీ ఉంటుంది. కానీ అందుకు తగిన అవకాశం రావడమే ఇక్కడ కీలకం. ఆ అవకాశం నాకు తొందరగా దక్కినట్లే. ఇక్కడ కేవలం గెటప్పులే కాదు. ఒక్కో ఎపిసోడ్‌లో మూడు రకాల దేహాకృతితో కనిపిస్తాను. అందుకోసం నేనుపడ్డ శ్రమ తాలూకు ఫలితం తెరపైన కనిపిస్తుంది" అని అన్నారు.
"ఇక ఆ సన్నివేశాల్ని చిత్రీకరించడానికి ముందు నా మెడకు పెద్ద గాయం అయింది. నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఏడు కేజీల బరువు పెరిగాను. దీంతో మళ్లీ కసరత్తులు చేసి, బరువు తగ్గించుకొని నటించాల్సి వచ్చింది. అసలే భోజనప్రియుణ్ని... నోరు కూడా కట్టుకోవల్సి వచ్చింది" అన్నారు.
"నేను పెద్దగా చదువుకోలేదు. ఆటల్లో రాణించాను. ప్రయాణాలు బాగా చేస్తాను. ఇదివరకు అమెరికా వెళ్లినప్పుడు అక్కడి షాప్ ల్లో మన సినిమాల సీడీ ఒక్కటీ కనిపించలేదు. కొరియన్, చైనీస్ సినిమాలు మాత్రం బోలెడన్ని ఉంటాయి. మన సినిమా ఇక్కడెందుకు ఉండకూడదు? అనే ఆలోచన ఎన్నోసార్లు వచ్చింది. అందుకే ఎప్పటికైనా ఒక అంతర్జాతీయస్థాయి సినిమా తియ్యాలన్నదే లక్ష్యంగా పెట్టుకొన్నాను. అందులో భాగంగానే ఈ దారిలో ప్రయాణం చేస్తున్నాను" అన్నారు.


Click it and Unblock the Notifications











