Vishnu VS Manoj: బయటపడిన మంచు బ్రదర్స్ గొడవలు.. మనోజ్ ఇంటిపై విష్ణు దాడి.. వీడియో వైరల్
కలెక్షన్ కింగ్, నటుడు, హీరో, విలన్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబుకు ఇద్దరు కుమారులు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమదైన శైలీలో ఎంటర్టైన్ చేశారు. ఇద్దరు తమదైన శైలీలో సినిమాలతో ఎంటర్టైన్ చేసిన మోహన్ బాబు స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇటీవలే మంచు విష్ణు జిన్నా మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించగా.. అంతకుముందు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇక మంచు మనోజ్ సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇవ్వగా ఇటీవలే మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. అయితే అన్నదమ్ములు అయిన విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఉలిక్కిపడతారా..
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్.. మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, అడవిలో అన్న, ఖైదీగారు సినిమాల్లో అలరించాడు. చాలా కాలం తర్వాత హీరోగా దొంగ దొంగది, శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కరెంట్ తీగ, పాండవులు పాండవులు తుమ్మెద, పోటుగాడు, ఎటాక్, గుంటూరోడు లవ్ లో పడ్డాడు, ఒక్కడు మిగిలాడు వంటి చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు.

ఇటీవలే రెండో పెళ్లి..
మంచు మనోజ్ పెద్ద సినీ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనదైన మేనరిజం, స్టైల్, నటనతో ఆకట్టుకున్నాడు. దొంగ దొంగది, రాజు భాయ్, బిందాస్, వేదం సినిమాలతో హిట్ కొట్టిన మంచు మనోజ్.. పలు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. అయితే మంచు విష్ణు గానీ, మంచు మనోజ్ గానీ మోహన్ బాబు రేంజ్ లో గుర్తింపు, సక్సెస్ అందుకోలేకపోయారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అన్నదమ్ముల మధ్య గొడవలు..
మంచు మనోజ్ లానే మౌనిక రెడ్డికి కూడా రెండో పెళ్లి. ఇప్పటికే తన మొదటి భర్త నుంచి మౌనిక విడాకులు తీసుకున్నారు. ఇక మౌనిక రెడ్డి ఫ్యామిలీ మొత్తం తెలుగు దేశం పార్టీలో ఉంది. మోహన్ బాబు కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్ పార్టీకి అనుకూలం అని తెలిసిందే. ఇదిలా ఉంటే అన్నదమ్ములు, హీరోలు అయిన మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అవి బహిర్గతం కావడం హాట్ టాపిక్ గా మారింది.

నెట్టింట్లో బయటకు..
గత కొన్నాళ్లుగా విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఇద్దరూ పలకరించుకుంటున్నప్పటికీ దూరం మాత్రం అలాగే ఉందట. ఇక మంచు మనోజ్ పెళ్లి కూడా అక్క మంచు లక్ష్మీ ఇంట్లోనే జరిగింది. ఆ పెళ్లికి మోహన్ బాబుతోపాటు విష్ణు కుటుంబం కూడా సమేతంగా హాజరైంది. అయితే విష్ణు అతిథిలా వచ్చి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయింది. ఇంతకాలం నాలుగు గోడల మధ్య ఉన్న మంచు విష్ణు, మనోజ్ విభేదాలు తాజగా నెట్టింట్లో బహిర్గతం అయ్యాయి.

మా వాళ్లను కొడుతుంటాడు..
మంచు మనోజ్ తాజాగా ఒక వీడియో షేర్ చేశాడు. అందులో మంచు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. తన మనిషి అయిన సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడి చేసేందుకు వచ్చినట్లుగా మనోజ్ తెలిపాడు. వీడియోలో "నా ఇష్టం.. వాడేదో అంటున్నాడు కదా.." అని విష్ణు అంటున్నాడు. మరోవైపు "ఇదండి అసలు విషయం.. ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు" అని మనోజ్ చెబుతున్నాడు. ఈ వీడియోను మనోజే తీసినట్లుగా తెలుస్తోంది.
విష్ణుపై మనోజ్ పోలీస్ ఫిర్యాదు..
ప్రస్తుతం మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విష్ణు, మనోజ్ మధ్య ఉన్న గొడవలు ఏంటనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక విష్ణు దాడి చేయడంపై అన్నపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మంచు లక్ష్మీ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











