శ్వేతాబసుకు వేషం ఇస్తానంటూ తెలుగు హీరో
హైదరాబాద్ : ఇటీవల వ్యభిచారం కేసులో పట్టుబడ్డ శ్వేతాబసు విషయమై అన్ని వర్గాల నుంచీ మద్దతు వస్తోంది. ఆమె విషయంలో మీడియా,పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపధ్యంలో సినిమా హీరో మంచు విష్ణు సైతం ఈ విషయమై మాట్లాడారు. తన తదుపరి చిత్రంలో వేషం ఇస్తానంటూ ప్రకటించారు. తనకు ఇలా జరగటం చాలా బాధాకరం అని అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.... "శ్వేతాబసు విషయంలో జరిగింది నిజంగా దారుణం. తనతో పాటు అదే హోటల్లో దొరికిన ఆ బడాబాబుల పేర్లను మీడియా కానీ, పోలీసులుకానీ ఎందుకు బయటపెట్టలేదు. సినిమా సెలబ్రిటీ అవ్వడమే ఆ అమ్మాయి చేసిన పాపమా? మీడియా, పోలీసులు కూడా ఈ విషయంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎక్కడ తప్పులు జరగడం లేదు చెప్పండి? మీడియాలో తప్పులు జరగవా. పదకొండేళ్ల వయసులోనే బాలనటిగా జాతీయ అవార్డు తీసుకున్న ప్రతిభావంతురాలు తను. ఆమెకు ఇలా జరగడం నిజంగా బాధాకరం. నా తదుపరి చిత్రంలో శ్వేతాబసు ప్రసాద్‌కి మంచి పాత్ర ఇస్తా" అన్నారు.

ఈ విషయమై దర్శకుడు రాజమౌళి స్పందించారు. శ్వేతా బసు గురించి హిందీ టీవీ నటి సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలకు ఆయన తన మద్దతు ప్రకటించారు. తన్వర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఉందా? అంటూ ఆయన ట్వీట్ చేసారు.
ఇక క్రితం ఆదివారం రాత్రి నగరం లోని ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్‌పై జరిపిన దాడిలో సినీనటి, ఆమెతో పాటు ఉన్న పేరుమోసిన పారిశ్రామిక వేత్త పట్టుబడ్డారు. అయిత, ఆ పారిశ్రామికవేత్త ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొనిరావటంతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. అదుపులోకి తీసుకున్న ఆ సినీనటిని పునరావాస కేంద్రానికి తరలించారు. బ్రోకర్ బాలును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతను రూ.లక్ష కమీషన్ తీసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











