వివేకా అంకుల్ చనిపోతే ఇంత నీఛంగానా.. మానవత్వం మురికికాలువలో.. మంచు విష్ణు!
శుక్రవారం ఉదయం వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన వార్త అందరిని షాక్ కి గురిచేసింది. మొదటి గుండె పోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన మృత దేహం రక్తపు మడుగులో ఉండడం, శరీరంపై గాయాలు ఉండడంతో వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరో హత్య చేశారనే అనుమానాలు బలపడ్డాయి. వివేకానందరెడ్డి మృత దేహానికి పోస్ట్ మార్టం అనంతరం ఆయన మృతి హత్యే అని వైద్యులు నిర్ధారించారు. వైఎస్ వివేకా మృతి జగన్ కుటుంబసభ్యులని విషాదానికి గురిచేసింది. ఇక మంచు ఫ్యామిలీకి వైఎస్ వివేకా బంధువు. శుక్రవారం వైఎస్ వివేకా మృతదేహానికి మంచు ఫ్యామిలీ నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.

వైఎస్ ఫ్యామిలీతో బంధుత్వం
మంచు విష్ణు సతీమణి విరోనిక వైఎస్ కుటుంబానికి చెందిన ఆడపడుచే. వైఎస్ సోదరుడికి కుమార్తె ఆమె. మృతి చెందిన వైఎస్ వివేకానందరెడ్డి ఆమెకు చిన్నాన్న అవుతాడు. అందుకే విరోనిక వైఎస్ వివేకా మృత దేహం వద్ద భోరున విలపించింది. చిన్నాన్న మృతిని జీర్ణించుకోలేకపోయింది. ఇదిలా ఉండగా మంచు విష్ణు తాజాగా ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివేకా మృతి గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం, రాజకీయ నాయకుల కామెంట్స్ పై మండిపడ్డాడు.
మానవత్వం మురికి కాలువలో
వైఎస్ వివేకానందరెడ్డి అంకుల్ మృతి గురించి కొందరు రాజకీయ నాయకులూ చేస్తున్న కామెంట్స్ వింటున్నా. వారి మాటలు వింటుంటే మానవత్వం మురికి కాలువలో కొట్టుకుపోతున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి క్రూరమైన చర్యలని ఖండించాల్సింది పోయి నీఛంగా మాట్లాడుతున్నారు అని మంచు విష్ణు ఫైర్ అయ్యాడు.

బురదజల్లుతూ
చావుని కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటూ, బురదజల్లే పని పెట్టుకున్నారు. చూస్తుంటే వీళ్లకు కనీసం బుర్ర ఉన్నట్లు అనిపించడం లేదు అని మంచు విష్ణు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాకు నివాళులు అర్పించిన అనంతరం మోహన్ బాబు కూడా ఇదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘోరాలని పైనుంచి భగవంతుడు గమనిస్తూనే ఉంటాడని మోహన్ బాబు అన్నారు.

అజాత శత్రువు
వైఎస్ వివేకా అజాత శత్రువులాంటి వ్యక్తి. ఈ విషయాన్ని ఇతర పార్టీల వాళ్ళు కూడా చెబుతారు. అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అని మోహన్ బాబు ప్రశ్నించారు. పోలికేసులు నిజాలు తొక్కి పెట్టకుండా పారదర్శకంగా విచారణ చేపట్టాలని మోహన్ బాబు కోరారు. వైఎస్ వివేకా హత్య విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











