మణికర్ణిక వివాదం: కంగనా నిజస్వరూపం బయటపెట్టిన మరో నటి..
'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' విషయంలో కంగనా రనౌత్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే కంగనా తీరును ఎండగడుతూ దర్శకుడు క్రిష్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా... తాజాగా ఈ చిత్రంలో కాశీభాయి అనే కీలకమైన పాత్ర పోషించిన హీరోయిన్ మిష్టి చక్రవర్తి... కంగనా మీద విమర్శల వర్షం కురిపించింది.
సినిమాలో తన పాత్ర నిడివి కంగనా చాలా వరకు కట్ చేసిందని చెప్పిన మిష్టి... దర్శకుడు క్రిష్‌కు మద్దతుగా మాట్లాడారు. సినిమాను ఎక్కువ శాతం ఆయనే డైరెక్ట్ చేశారని, ఆ క్రెడిట్ ఆయను ఇవ్వకుండా కంగనా ప్రవర్తించిన తీరు ఆమోద యోగ్యం కాదన్నారు.

నాపై అందమైన సీన్లు చిత్రీకరించారు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిష్టి మాట్లాడుతూ...క్రిష్ దర్శకత్వంలో చేయాలని చాలా కాలంగా ఎదురు చూశాను. ఆయన ఈ చిత్రంలో తనకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇస్తానని మాట ఇచ్చారు. చెప్పిన ప్రకారమే చేశారు. నాపై ఎంతో అందమైన సీన్లు చిత్రీకరించారని తెలిపారు.

కంగనా చెడగొట్టింది
అయితే తనపై చిత్రీకరించిన సీన్లను చాలా వరకు కంగనా సినిమాలో లేకుండా చేసిందని, దీంతో నా పాత్రకు తగిన ప్రాధాన్యత దక్కుండా పోయిందని మిష్టి వాపోయారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదన్నారు.

క్రిష్‌కు పెరుగుతున్న మద్దతు
మిష్టి చక్రవర్తి వ్యాఖ్యలతో దర్శకుడు క్రిష్‌కు మద్దతు మరింత పెరిగినట్లయింది. పూజా భట్ లాంటి వారు సైతం ఆయనకు మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే కంగనా ఈ పరిణామాలతో మరోసారి వివాదాల్లో ఇరుక్కుంది.

మణికర్ణిక
మణికర్ణిక చిత్రం తొలుత క్రిష్ దర్శకత్వంలో మొదలై సినిమా మొత్తం పూర్తయినప్పటికీ... తనకు నచ్చిన విధంగా మార్పులు చేసేందుకు దర్శకత్వ బాధ్యతలు చేజిక్కించుకుంది. కంగనాతో విబేధించిన క్రిష్ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నారు. అయితే విడుదలైన సినిమాలో 70 శాతం తాను చిత్రీకరించిన భాగమే ఉందని, అయితే అందుకు తగిన క్రెడిట్ తనకు దక్కడం లేదని ఆయన వాపోతున్నారు.


Click it and Unblock the Notifications











