తెలుగులో ఫ్లాఫ్ టాక్...హిందీ రీమేక్ ప్రకటన
హైదరాబాద్ : సాధారణంగా ఒకచోట హిట్ అయిన చిత్రాలు మరో భాషలోకి రీమేక్ చేయటం జరుగుతూంటుంది. అయితే ఇక్కడ ఆడని సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేసి ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూంటూరు. ఇప్పుడు అలాంటిదే మరొకటి జరిగింది. షఫి ప్రధాన పాత్రలో నటించిన ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారు. వర్మ చిత్రాల ద్వారా ఎదిగి తర్వాత కాలంలో ఆయనతోనే తగువు పడిన మనోజ్ బాజపేయ్ ఈ చిత్రంలో వర్మ గా కనిపించనున్నారు.
దర్శకుడు రాకేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.... ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ చిత్రానికి మౌత్ పబ్లిసిటీ బాగుంది. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా చాలా కొత్తగా వుందని అంతా అంటున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో మనోజ్ బాజ్‌పాయ్‌తో నా దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్నాం. ఇటీవలే ఆయన చిత్ర కథ విని తన అంగీకారాన్ని తెలియజేశారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తి వివరాల్ని తెలియజేస్తాను అన్నారు.

చిత్రం కథేమిటంటే.... శ్యామ్‌గోపాల్ వర్మ అలియాస్ శ్యాము (షఫి) యవ దర్శకుడు. ‘నచ్చిన సినిమాను తీసే హక్కుంది. చూస్తే చూడండి లేదంటే లేద'న్న వాదనతో వరుసపెట్టి సినిమాలు తీస్తుంటాడు. క్రైమ్‌కి కనెక్టయిన అతని మైండ్ -రక్తపాతాన్ని ఎక్కువగా చూపిస్తుంటుంది. అలా అతను తీసిన ఓ సినిమాలోని హింసాత్మక సంఘటనలు -సీమలో చల్లారిన ఫ్యాక్షన్ గొడవలను ప్రేరేపిస్తుంది. ఒకరోజు -శ్యాము కిడ్నాప్‌నకు గురవుతాడు. అడవిలాంటి మారుమూల ప్రాంతంలో శిధిలమైపోయిన ఇంట్లో బంధింపబడతాడు. శ్యామును కిడ్నాప్ చేసిందెవరు? ఎక్కడో సీమలో మళ్లీ రాజుకున్న ఫ్యాషన్ ఘర్షణలకు, శ్యాముకు సంబంధమేమిటి? కిడ్నాప్ చెరనుంచి తన క్రియేటివ్ మైండ్‌ను ఉపయోగించి ఎలా తప్పించుకున్నాడు? -లాంటి ప్రశ్నలకు సమాధానాలే సినిమా.
ఈ సినిమా గురించి షఫి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకూ రామ్‌గోపాల్‌వర్మకూ ఎలాంటి సంబంధం లేదని ముందుగానే మా దర్శకుడు రాకేష్ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. నేను కూడా కథ చదివాను. ఈ సినిమాను చేయడానికి బాలీవుడ్‌లో మనోజ్ బాజ్‌పాయ్ సైతం ముందుకొచ్చారంటే కథలో ఉన్న లోతు ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా. దర్శకుడు చెప్పిన విషయాన్ని ఆకళింపు చేసుకుని నటించాను. తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ మౌత్ టాక్ బావుండటంతో వసూళ్లు పెరుగుతున్నాయి. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన సినిమా ఇది'' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











